ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన ఫైబర్‌నెట్ కేసు ఎట్టకేలకు ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSFL) ఎండీ ఇచ్చిన నివేదికతో పాటు, సీఐడీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ కేసును అధికారికంగా మూసివేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. ఈ కేసు అధికార పక్షం (వైసీపీ) మరియు ప్రతిపక్షం (టీడీపీ) మధ్య తీవ్ర రాజకీయ ఆరోపణలకు దారి తీసింది. ముఖ్యంగా, 2014-19 మధ్య చంద్రబాబు నాయకత్వంలో భారత్ నెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఫేజ్-1 పనుల్లో రూ. 321 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు కోసమే నాటి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 2021 జులై 11న సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

సీఐడీ దర్యాప్తు ఆదేశాల మేరకు, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఎండీ ఎం. మధుసూదన్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా 2021 సెప్టెంబర్ 9న ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇందులో మొత్తం రూ. 321 కోట్ల అక్రమాలు జరిగినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో ఐపీసీ సెక్షన్లు (166, 167, 418, 465, 468, 417, 409, 506, r/w 120-B) తో పాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు (13(2)r/w 13(1)(C)(D)) కింద కేసు నమోదైంది. చంద్రబాబు నాయుడు టెండర్ ప్రక్రియను ప్రభావితం చేసి, రూ. 330 కోట్ల ఫేజ్-1 పనులను టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్‌కు అప్పగించారని ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా, టెరా సాఫ్ట్‌వేర్ గతంలో బ్లాక్ లిస్ట్‌లో ఉందని, ఆ కంపెనీ డైరెక్టర్లు చంద్రబాబు కుటుంబ కంపెనీ అయిన హెరిటేజ్‌లో కూడా డైరెక్టర్లుగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో చంద్రబాబును ఏ 25గా చేర్చడంతో పాటు, పదహారు మందిని నిందితులుగా సీఐడీ పేర్కొంది.
Latest News: Earthquakes: వణికిస్తున్న భూమి.. 30 రోజుల్లో 1400 భూకంపాలు
ఈ వివాదం తీవ్రత దృష్ట్యా, 2023 అక్టోబర్ 31న హోమ్ సెక్రటరీ హరీష్‌గుప్తా జీవో ఎంఎస్. నెంబర్ 180 జారీ చేసి, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్‌లోని పలు ఆస్తులను అటాచ్ చేయాలని ఆదేశించారు. దీనికి ముందు, గతేడాది ఫిబ్రవరిలో విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ కేసులో ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది. అయితే, సుదీర్ఘ దర్యాప్తు, అనేక రాజకీయ ఆరోపణలు, ప్రతి ఆరోపణల అనంతరం, ఎపీఎస్‌ఎఫ్‌ఎల్ ఎండీ మరియు సీఐడీ అధికారులు సమర్పించిన తుది నివేదికలో ఫైబర్‌నెట్ ప్రాజెక్ట్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టమైంది. ఈ నివేదికలను పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు, కేసులో ఎటువంటి అవినీతి లేదని నిర్ధారించి, ఫైబర్‌నెట్ కేసును క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీనితో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపిన ఈ సున్నితమైన అంశం అధికారికంగా ఒక కొలిక్కి వచ్చినట్లైంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/