కల్తీ మద్యం కేసులో సుమారు ఏడు నెలలుగా జైలు జీవితం గడిపిన వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎట్టకేలకు విడుదలయ్యారు. గతేడాది జూన్‌లో అరెస్టైన ఆయన, విజయవాడ జైలు నుంచి బయటకు రాగానే వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు ఆయనకు పూలమాలలు వేసి సంఘీభావం ప్రకటించారు. సుదీర్ఘ కాలం తర్వాత విడుదలైన చెవిరెడ్డిని చూసేందుకు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున తరలిరావడంతో జైలు పరిసర ప్రాంతాల్లో రాజకీయ కోలాహలం నెలకొంది.
Tamil Nadu Elections : విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్
విడుదల అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను చంద్రగిరి నియోజకవర్గం నుంచి రాజకీయంగా ఎదగడమే చంద్రబాబుకు నచ్చడం లేదని, అందుకే తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. “చంద్రబాబు పుట్టిన గ్రామంలోనే (నరవారిపల్లి) నేను కూడా పుట్టడం నేను చేసిన తప్పా?” అని ఆయన ప్రశ్నించారు. గతంలో తనను అరెస్టు చేసిన తీరు అత్యంత అవమానకరంగా ఉందని, కేవలం రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు బనాయించి తనను ఇబ్బంది పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిణామం ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న రాజకీయ యుద్ధాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. చెవిరెడ్డి విడుదల వైసీపీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుండగా, కల్తీ మద్యం కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన మొదటి రోజే ఆయన నేరుగా ముఖ్యమంత్రిని లక్ష్యం చేసుకోవడం చూస్తుంటే, రాబోయే రోజుల్లో చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మరీ ముఖ్యంగా చంద్రగిరిలో పోరు మరింత తీవ్రం కానుందని అర్థమవుతోంది. న్యాయపోరాటం ద్వారా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చెవిరెడ్డి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com