ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) ఈ నెల 26వ తేదీన సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు.. ఆరు రోజుల పాటు జరగనున్న ఈ విదేశీ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించాలనే ప్రధాన లక్ష్యంతో సీఎం పర్యటించనున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ చంద్రబాబు ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా అంతర్జాతీయ పర్యటనలు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే దిశగా ఆయన కసితో ముందుకు సాగుతున్నారు.
విదేశీ సంస్థలతో భేటీలు – పెట్టుబడులపై దృష్టి
సింగపూర్ పర్యటనలో చంద్రబాబు వివిధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, విద్య, హెల్త్‌కేర్, టూరిజం రంగాల్లో పెట్టుబడుల కోసం ఈ సమావేశాలు జరుగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమరావతి నగర అభివృద్ధికి సంబంధించి సమగ్ర ప్రణాళికపై చర్చించనున్నట్టు సమాచారం.
ప్రవాసాంధ్రులతో ముఖాముఖీ
సింగపూర్ లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులతో సీఎం చంద్రబాబు ముఖాముఖీ భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన తమ ఆలోచనలు, సూచనలు తెలిపేందుకు ప్రవాసాంధ్రులకు ఈ సమావేశం వేదికగా మారనుంది. సీఎం వెంట ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ, మంత్రులు టీజీ భరత్ తదితరులు ఉన్నతాధికారులతో కలిసి పాల్గొననున్నారు. ఈ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి బలమైన బాటలు వేసే అవకాశంగా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
Read Also : AP : కొత్తగా 2వేల కి.మీ. రోడ్ల నిర్మాణం – సీఎం చంద్రబాబు