MRMA 2.0 Silk Industry: పట్టు పరిశ్రమను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేసి, రైతులకు అధిక దిగుబడులు మరియు మెరుగైన ఆదాయం అందించడమే లక్ష్యంగా కేంద్ర పట్టు మండలి (Central Silk Board) ఆధ్వర్యంలో ‘మేర రేషం మేర అభిమాన్ (MRMA) 2.0’ కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గంలో శనివారం వాటాదారుల సంప్రదింపుల సమావేశం నిర్వహించారు.పట్టు పరిశ్రమలో ఎదురవుతున్న వివిధ సవాళ్లను శాస్త్రీయ దృక్పథంతో అధిగమించి, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరుగా రైతుల క్షేత్రాలకు చేర్చేందుకు ఈ సమావేశం ఒక కీలక వేదికగా నిలిచింది.
ఆధునిక పరిజ్ఞానంతోనే ఉత్పాదకత పెంపు – డాక్టర్ మురళి ఎస్.
సమావేశంలో అనంతపురం సీఎస్‌బీ-ఆర్‌ఎస్‌ఆర్‌ఎస్ (CSB-RSRS) అధిపతి, శాస్త్రవేత్త–డి డాక్టర్ మురళి ఎస్. (నామినేటెడ్ సైంటిస్ట్) మాట్లాడుతూ.. పట్టు పరిశ్రమలో సంప్రదాయ విధానాలకు తోడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందన్నారు. దీనివల్ల రైతుల సాగు వ్యయభారం తగ్గడంతో పాటు నాణ్యమైన కోకూన్ల ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో శాస్త్రీయ పద్ధతులను విస్తృతంగా అమలు చేయడం ద్వారా పట్టు రంగాన్ని పోటీతత్వంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.జిల్లా పట్టు అభివృద్ధి అధికారి డాక్టర్ విజయ్ కుమార్ (నోడల్ అధికారి), కళ్యాణదుర్గం ఏడీఎస్ (ఎఫ్‌ఏసీ) శ్రీమతి రేణుక కూడా కార్యక్రమంలో పాల్గొని అధికారులకు, రైతులకు పలు సూచనలు చేశారు.
కార్యాచరణ ప్రణాళిక – ‘స్వాట్’ విశ్లేషణ
ఈ సమావేశంలో మైక్రోప్లాన్ అమలు, ప్రాధాన్యతా అంశాల గుర్తింపు, స్వాట్ (SWOT) విశ్లేషణ, బేస్‌లైన్ సర్వే డేటా సేకరణ, అలాగే జిల్లా అవసరాలకు అనుగుణంగా స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనపై అధికారులు విస్తృతంగా చర్చించారు.స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాల్సిన సాంకేతిక కార్యక్రమాలు, రైతులకు అవసరమైన ప్రత్యేక శిక్షణ, విస్తరణ సేవలు మరియు క్షేత్రస్థాయి పర్యవేక్షణ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

MRMA 2.0 Silk Industry: పరిశోధన – విస్తరణ – రైతు సమన్వయమే లక్ష్యం
MRMA 2.0 కార్యక్రమం ద్వారా పరిశోధనా సంస్థల్లో అభివృద్ధి చేసిన ఆధునిక సాంకేతికతను నేరుగా రైతులకు చేరవేసి, శాస్త్రీయ సాగు విధానాలను ప్రోత్సహించడం, రైతుల ఆదాయ వృద్ధి మరియు పట్టు పరిశ్రమలో స్థిరమైన అభివృద్ధి సాధించడమే ప్రధాన లక్ష్యమని అధికారులు వివరించారు.రైతుల అవసరాలు, స్థానిక సమస్యలు, మార్కెట్ అవకాశాలను సమగ్రంగా విశ్లేషించి రూపొందించే కార్యాచరణ ప్రణాళిక పట్టు పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. పరిశోధన – విస్తరణ – రైతు అనే మూడు వ్యవస్థల మధ్య సమన్వయం పెరగడం ద్వారా జిల్లాలో పట్టు పరిశ్రమకు కొత్త ఊపు లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లాలోని వివిధ డివిజన్లకు చెందిన పట్టు పరిశ్రమ అధికారులు, సాంకేతిక అధికారులు, గ్రామీణ పట్టుపరిశ్రమ సహాయకులు, క్షేత్రస్థాయి సిబ్బంది మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :