నెల్లూరు జిల్లా (Nellore District) దుత్తలూరు మండలంలో ఆదివారం అర్ధరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న వెంగయ్య అనే వ్యక్తి, తన భార్య వెంకాయమ్మపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. భార్యను రక్షించేందుకు మధ్యపడ్డ అత్త జయమ్మ (60), మామ కల్లయ్య (65)లను కూడా ఆయన దారుణంగా నరికేశాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర కలకలం ఏర్పడింది.
అత్తమామలు అక్కడికక్కడే మృతి – భార్యకు తీవ్ర గాయాలు
వెంగయ్య దాడిలో అత్తమామలు అక్కడికక్కడే మృతి చెందగా, భార్య వెంకాయమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కుటుంబ కలహాల మధ్య మద్యం మత్తులో ఈ దాడికి పాల్పడ్డాడని పోలీసుల అనుమానం. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, గత కొన్ని రోజులుగా ఇంట్లో పెద్దగా వాగ్వాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
నిందితుడు పరారీలో – పోలీసులు గాలింపు చర్యలు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న వెంగయ్య కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గ్రామస్తులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, నిందితుడిని త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి పోలీసుల బందోబస్తు కల్పించి, మరిన్ని ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. మానవత్వాన్ని తాకట్టు పెట్టే ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.
Read Also : Swetcha: స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో.. తెరపైకి పూర్ణచందర్ భార్య