బీహార్ రాష్ట్రానికి ఎన్నికల జ్వరమొచ్చింది. రాజకీయాల్లో టక్కుటమార గోకర్ణ విద్యలన్నీ సహజంగా చూస్తుంటాము. ఈ రాష్ట్రంలో అ లాంటి విద్యలు తెలిసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సొంత పార్టీ ‘జనసురాజ్’ కూడా రంగంలో ఉంది. బీహార్లో అధికారం నుంచి ప్రస్తుత ఎన్టీఏను పదవీచ్యుతిని చేయాలని ఆయన ఆకాంక్ష. ఇతరత్రా పార్టీల వారు హేమా హేమీలు. రాజకీయాల్లో తన మాటే నెగ్గించుకోటానికి ఎంతకైనా వెనుకాడని నితీష్ కుమార్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం, పశుదాణా కుంభకోణంలో తనకు తానే సాటి అని కటకటాలను చూసొచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్, ఇప్పుడాయన వారసులు కూడా ఎవరికి వారే అన్న చందాన బీహార్ ఎన్నికలలో (Bihar election) ఎవరి పాత్రవారు నిజాయితీగా పోషస్తున్నట్లే చెప్పాలి. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవని అందరికీ తెలిసిందే. ఇప్పుడదే జరిగింది. లాలూప్రసాద్ వారసులు గా చెలామణీ అవుతున్న తేజ్ ప్రతాప్ యాదవ్, మరోపక్క లాలూ వారసత్వానికి తానే సరైన వారసుడనిపించుకున్న తేజస్వియాదవ్లు రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. ఎవరికి ఏ అంశం కలిసి వస్తుందో ఇప్పుడే చెప్పలేమని విశ్లేషకులు తమ కళ్లెదుట జరుగుతున్న రాజకీయాలను పరిశీలిస్తు న్నారు. జెడియు నేత నితీష్కుమార్ ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల ఖరారులో చాలా లుకలుకలు ఎదురు చూసాయి. కాని చిన్న చిన్న పార్టీలు తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. విపక్ష ఫ్రంట్ గా చెప్పబడే ఆర్జేడి, కాంగ్రెస్ల మధ్య ఇంకా సర్దుబాట్లు పూర్తిస్థాయిలో జరుగలేదు. లాలూ తనయుడు జనశక్తి జనతాదళ్ స్థాపించాడు. ఆ పార్టీకి లాలూ తనయ రోహిణి ఆచార్య ఆశీస్సులున్నాయి. ఇలా లాలూ సామ్రాజ్యం చీలికలు పేలికలు అయినా, ఆయన మరో కుమారుడు తానే కాబోయే ముఖ్యమంత్రినని స్వయంగా ప్రకటించుకుని మహా కూటమిని నిర్దే శించే పనిలో పడ్డాడు. ఇంటిపోరు అలా ఉండగా కాంగ్రెస్తో చెలిమి చేయడంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించ లేకపోతున్నాడు. ఇవన్నీ అవకాశంగా తీసుకుని జనసురాజ్ అన్ని స్థానాల్లోనూ పోటీ చేసే స్థాయిలో ఉందని చెప్పుకుంటూ ప్రశాంత్ కిషోర్ తాను ప్రస్తుతానికి అసెంబ్లీ ఎన్నికలో పోటీకి దిగడంలేదు. ఇది కూడా ఒక వ్యూహమే. ఆ పార్టీకి వ్యూహకర్త, ఆకర్షణీయ శక్తి ఆయనే కనుక జనం ఎలాస్వాగతిస్తారో చూడాలి. నితీష్కుమార్తో విభేదించి బయటపడినప్పటి నుంచి ప్రశాంత్ ఊరూరా ఇంటింటికీ తిరుగుతూ జనాన్ని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఎన్నికల కమిషన్ బీహార్లో అమలు చేస్తున్న ఓటర్ల సంస్కరణ ‘సర్’ తో విబేధించి జనంలో బాగా గుర్తింపు వచ్చింది. అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్ డ్రామాలాడుతోందని ప్రజలే భావించే పరిస్థితి ఏర్పడింది. రాహుల్ గాంధీతో తలపడి ఆనక సుప్రీంకోర్టు మొట్టికాయలు తిన్న ఎన్నికల కమిషన్ కాస్త పరపతి కూడా కోల్పోయింది. తన చిత్తశుద్ధిని నిరూ పించుకునే పనిలో ఆ ప్రభుత్వ సంస్థ బాగా తంటాలుప డుతోంది. అధికార పార్టీ ఎన్నికల ప్రచారంలో స్వయంగా దిగడమే కాకుండా నలుగురు ఎన్డీయే రాష్ట్రాల ముఖ్య మంత్రులను కూడా ప్రచారగోదాలోకి దింపింది. సర్దుబాట్లు జరిగినా జరుగకపోయినా దాదాపు ప్రధాన పార్టీలు ముందస్తు జాగ్రత్తలతో తమ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిం చేశారు. ఇలాంటి వ్యూహం బెడిసికొట్టి చివరాఖరుకు ‘రెబల్స్’ బెడదతో ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. బీహార్లో తమకు 40 స్థానాల్లో ముస్లిం జనాభా ఉన్నం దున అక్కడ తామెందుకు పోటీ చేయరాదని అనుకున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పడి రంగంలోకి దిగింది. సర్దుబాట్లు, సమాలో చనలు ఒకపక్క జరుగుతుండగానే ఏయేపార్టీకి ఎవరెవరు స్టార్ కంపెయినర్లుగా ఉండాలో యోచన చేస్తున్నారు. ఈసారి ఆ రాష్ట్రంలో ఎన్నికలు అలాంటిలాంటి వ్యూహాలతో నడవవని అర్థమవుతోంది. ఎన్డీయేకు కూడా అంతర్గతంగా భాగస్వామ్య పక్షాలలో విబేధాలు పొడచూపా యి. చిరాగ్ పాశ్వాన్ (ఎన్ఎపి) జితిన్ మాంఝి, (హిందూస్థానీ అవామా మోర్చా) ఉపేంద్ర కుష్వాహ (రాష్ట్రీయ లోక్ మోర్చా) లు తమకు కేటాయించిన సీట్లు, స్థానాల విషయంలో ఏ మంత సంతోషంగా లేరు. కాగా భారత్లో ఎన్నడూ లేని విధంగా రాజకీయ వ్యూహాలు ఎన్నికల కమిషన్, పార్టీల ప్రాభవం, ఓటర్ల ప్రలోభాలు వంటి వాటికి ఈసారి జరుగుతున్న బీహార్ ఎన్నికలు (Bihar election) నమూనాగా ఉండగలవన్న అంచనాలున్నాయి. బీహార్లో దాదాపు చిన్న చితకా పార్టీలు ఒంటరిగానో, పెద్ద పార్టీ లతో కలిసో సీట్ల పంపకాలు చేసుకుని పోటీలోకిదిగాయి. మహాగర్ బంధన్ నుంచి వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ బయటపడింది. ఏ పార్టీ మహిళలకు తగిన దామాషాతో సీట్లు కేటాయించలేదని తేలిపోయింది. ఎన్నికల నిర్వహణ విషయానికొస్తే తాము సజావుగానే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకునేందుకు ఎన్నికల కమిషన్ ఆపసోపాలు పడుతోంది. ఏమయితేనేం అన్ని అగ్ని పరీక్షలను తట్టుకుని నిలబడుతూ ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియచేసింది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్వే విశ్వసనీయతను దెబ్బతీ సేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్జిఓలు సుప్రీంలో పిటిషన్లు వేసాయని ఇసి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక నిబద్ధతతో ఎన్నికల నిర్వహణ ఒక్కటే ఎన్నికల కమిషన్ బాధ్యతగా మిగిలింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: