ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ ఉద్యోగులు పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నారని, అయితే కండక్టర్లు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన పని ఒత్తిడిని ప్రభుత్వం గానీ, యాజమాన్యం గానీ పట్టించుకోవడం లేదని ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా పథకాన్ని సమర్థవంతంగా కొనసాగించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
Read also: Big Alert : ఏపీలోని పెన్షనర్లకు బిగ్ అలర్ట్

AP
విధి నిర్వహణలో జరుగుతున్న చిన్న చిన్న పొరపాట్లకే తనిఖీ అధికారులు కేసులు నమోదు చేయడం, డిపో మేనేజర్లు వాస్తవాలను పరిశీలించకుండా సస్పెన్షన్లు, కఠిన శిక్షలు విధించడం అన్యాయమని పలిశెట్టి విమర్శించారు. ఈ పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తులో కండక్టర్లు, డ్రైవర్లు విధులు నిర్వహించడం మరింత కష్టతరమవుతుందని హెచ్చరించారు. ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసే చర్యలు పథకం విజయానికి అడ్డంకిగా మారతాయని ఆయన పేర్కొన్నారు.
ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎన్‌టీఆర్ జిల్లా విద్యాధరపురం డిపో యూనియన్ నిర్మాణ మహాసభలో పలిశెట్టి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు ఉమ్మడి జిల్లాల్లోని 15 డివిజన్లలో న్యాయపరమైన కారణాలతో నిలిచిపోయిన పదోన్నతులను తక్షణమే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమావేశంలో ఈయూ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.డి. ప్రసాద్ మాట్లాడుతూ, స్త్రీ శక్తి పథకంతో పెరిగిన పని భారాన్ని తగ్గించాలంటే కనీసం 3 వేల కొత్త బస్సులు ప్రవేశపెట్టడంతో పాటు, అన్ని కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో 10 వేల నియామకాలు వెంటనే చేపట్టాలని కోరారు. కొత్త బస్సులు, కొత్త సిబ్బంది లేకుండా ఇదే ఉద్యోగులతో పథకాన్ని నడపడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: