విజయవాడ : భూరికార్డుల్లో తప్పులకు జగన్ పాలనే కారణమని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జరిపిన రీ సర్వే 1.0 లో అనేక తప్పులు దొర్లాయన్నారు. ఆనాటి పాపాలను ఇప్పటికీ కడుగుతున్నామని తెలిపారు. రీసర్వే 1.0పై గ్రామసభలు పెడితే 2.5 లక్షల ఫిర్యాదులు వచ్చాయన్నారు. అనంతరం కూడా -జాయింట్ ఎల్పీఎమ్ లతోపాటు అనేక సమస్యలపై ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. వాటిల్లో చేయదగినవి వంద శాతం పరిష్కరించామని స్పష్టం చేసారు. విస్తీర్ణం విషయంలో రీసర్వే సమయంలో రైతులు చెప్పిన సరిహద్దులే కీలకమని వ్యాఖ్యానించారు. వందేళ్ల క్రితం జరిగిన బ్రిటీష్ వాళ్ల గొలుసు కొలత పద్ధతి కారణంగా భూ విస్తీర్ణంలో సమస్యలు వచ్చాయని అందువల్లే కొంత మంది రైతుల డాక్యుమెంట్ కు వాస్తవ భూమికి స్వల్పంగా తేడా ఉందన్నారు.
Read also: AP Bus Accident: ట్రావెల్స్ బస్సులో మంటలు

రైతులు చెప్పిన సరిహద్దులను సరిగ్గా కొలవ లేదనుకుంటే మళ్లీ సర్వేకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎల్పీ నెంబర్లలో కరెక్షన్లు రెండు నెలల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎల్బీఎంల సబ్ డివిజన్ ను మార్చి 31 వరకు పూర్తి చేస్తామన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఒకటి, రెండు తప్పులుంటే వెనువెంటనే సరిచేస్తామని వెల్లడించారు. నూతన సంవత్సరం బహుమతిగా భూ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రాష్ట్రంలో 5 రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగిస్తూ కొత్త సంవత్సరంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని తొలి సంతకం చేశారు. మిగిలిన 5 రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. 5 కేటగిరీలకు చెందిన భూములను 22 ఏ నిషిద్ధ జాబితా నుంచి తొలగిస్తున్నామని మంత్రి తెలిపారు.
స్వతంత్ర సమరయోధులు, సైనిక ఉద్యోగులకు భూములు, ప్రైవేటు పట్టా భూములు, రాజకీయ బాధితులకు చెందిన భూములను 22 ఏ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధిత పత్రాలు ఉంటే నిషిద్ద జాబితా నుంచి తొలగిస్తామని తెలిపారు. ప్రైవేట్ భూములు 22ఏలో ఉండేందుకు వీల్లేదని, ప్రయివేట్ పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాలని ఆదేశించారు. రాజకీయ బాధితులకు కేటాయించిన భూములను కూడా 22 ఏ నుంచి తొలగించనున్నట్లు మంత్రి తెలిపారు. మాజీ సైనికుల భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసిన సిఫార్సుల రిజిస్టర్ సరిపోతుందని, 10(1) రిజిస్టర్, అడంగల్స్, ఎస్ఎఫ్ఎ లాంటి పాత రెవెన్యూ రికార్డులు సహా ఎసైన్మెంట్ రిజిస్టర్లు, డీఆర్ దస్త్రాలు 22 ఏ నుంచి తొలగించనున్నట్లు తెలిపారు. రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఏదోకటి ఉన్నా 22 ఏ నుంచి తొలగిస్తామని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: