ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించిన సాధారణ బదిలీల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. గతంలో విధించిన బదిలీల నిషేధాన్ని ఎత్తివేస్తూ, కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు మే 16వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, జూన్ 2వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బదిలీల ప్రక్రియ కొనసాగనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి ఆర్థిక శాఖ నుంచి కూడా అధికారిక అనుమతి లభించింది.

ముఖ్యమైన మార్గదర్శకాలు:
ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసినవారికి తప్పనిసరిగా బదిలీ
ఒకే చోట ఐదు సంవత్సరాల పాటు పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కచ్చితంగా బదిలీ (transfer) చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. అదేవిధంగా, పదోన్నతి పొందిన తర్వాత కూడా ఒకే ప్రాంతంలో ఐదేళ్లుగా కొనసాగుతున్న వారికి సైతం ఈ బదిలీలు వర్తించనున్నాయి. అయితే, ఐదేళ్ల లోపు సర్వీసు ఉన్న ఉద్యోగులు వ్యక్తిగత అభ్యర్థనల మేరకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ప్రత్యేక పరిస్థితులలో మినహాయింపులు మరియు ప్రాధాన్యతలు:
వచ్చే ఏడాది మే 31, 2026 నాటికి పదవీ విరమణ చేయనున్నవారికి సాధారణ బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వబడుతుంది. దృష్టి లోపం కలిగిన (అంధులైన) ఉద్యోగులు కోరుకుంటే, వారి బదిలీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మానసిక వికాస సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులైన ఉద్యోగులకు, వారి విజ్ఞప్తి మేరకు బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తారు.
వికలాంగులకూ ప్రాధాన్యత
గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు, వారు కోరిన పక్షంలో బదిలీల్లో ప్రాధాన్యత దక్కుతుంది. వైద్యపరమైన కారణాలతో బదిలీ కోరే ఉద్యోగుల అభ్యర్థనలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వితంతువులైన ఉద్యోగినులు వారి వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యం పొందుతారు. భార్యాభర్తలైన ఉద్యోగులు (స్పౌజ్ కేసులు) ఒకేచోట లేదా సమీప ప్రాంతాల్లో పనిచేసేలా వారి బదిలీలకు ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
Read also: Nara Lokesh : త్వరలో మెగా డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ