సెప్టెంబర్ నెలలో రైతులకు యూరియా (Urea ) కొరత లేకుండా చూసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి మరో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ యూరియా త్వరలో రాష్ట్రంలోని వివిధ పోర్టులకు చేరుకుంటుందని ఆయన అన్నారు. దీనివల్ల రైతులకు రబీ సీజన్లో యూరియా సమస్య ఉండదని ఆయన భరోసా ఇచ్చారు.
రెండు రోజుల్లో యూరియా పంపిణీ ప్రారంభం
మంత్రి అచ్చెన్నాయుడు (Acham Naidu) తెలిపిన వివరాల ప్రకారం, కాకినాడ పోర్టు నుంచి 17,294 మెట్రిక్ టన్నులు, మంగళూరు పోర్టు నుంచి 5,400 మెట్రిక్ టన్నులు, జైగర్ పోర్టు నుంచి 10,800 మెట్రిక్ టన్నులు, విశాఖపట్నం పోర్టు నుంచి 15,874 మెట్రిక్ టన్నుల యూరియా రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రానికి చేరుకుంటాయి. ఈ యూరియా వచ్చిన వెంటనే రైతులకు పంపిణీ చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి
రైతులు యూరియా వాడకం విషయంలో జాగ్రత్తలు పాటించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వ్యవసాయ అధికారుల సిఫారసు మేరకు మాత్రమే యూరియా వాడాలని, అధికంగా వాడటం వల్ల పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన అన్నారు. యూరియా సరఫరాకు సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. ఈ విధంగా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.