ఏపీలో అవినీతి తిమింగలాల పని పడతామని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్ జనరల్ (డీజీ) అతుల్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. అవినీతిపరులపై ఇప్పటికే నిఘా పెట్టామని వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు మరింత దూకుడుగా ముందుకెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. అవినీతి పరుల బినామీ ఆస్తులను గుర్తించేందుకు ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను తొలిసారిగా వినియోగిస్తున్నామని ఆయన హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన వారిని మూడేళ్లలోనే శిక్ష పడేలా చేసి జైలుకు పంపడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన తేల్చి చెప్పారు. శుక్రవారం విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలన భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన అతుల్ సింగ్.. 2025 సంవత్సరానికి సంబంధించిన ఏసీబీ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా శాఖ కొత్త వ్యూహాలు.. భవిష్యత్ కార్యాచరణపై వివరించారు.
Read Also: Bullet Train : దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు పరుగులు పెడుతుందో తెలుసా ?

కరుడుగట్టిన అవినీతిపరులపై ప్రత్యేక నిఘా
ఈ సమావేశంలో ఏసీబీ డైరెక్టర్ ఆర్. జయలక్ష్మి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరుడుగట్టిన అవినీతిపరులపై ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. వారి పేరుపై కాకుండా బినామీల పేర్లతో కూడబెట్టిన ఆస్తుల వివరాలను ఏఐ సాయంతో సేకరిస్తున్నాం. ఈ ఏడాది అవినీతి తిమింగలాల పని పడతాం. అవినీతికి పాల్పడినవారికి మూడేళ్లలోనే శిక్ష పడేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని అతుల్ సింగ్ పేర్కొన్నారు.బినామీ ఆస్తులను గుర్తించేందుకు ఐజీఆర్ఎస్ (ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రెడ్రెస్ సిస్టమ్)తో పాటు రిజిస్ట్రేషన్ శాఖ డేటా, అనుమానాస్పద బ్యాంకు లావాదేవీల వివరాలను ఏఐ ద్వారా విశ్లేషించనున్నట్లు తెలిపారు. ఈ విధానంతో సంపాదనకు మించి ఆస్తులు కూడబెట్టిన అధికారులపై వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇందులో రెవెన్యూ శాఖలోనే అత్యధికంగా 19 ట్రాప్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతేడాది ఏసీబీ కేసుల్లో శిక్షల రేటు 46 శాతం మాత్రమే ఉందని అంగీకరించిన ఆయన, ఇది సంతృప్తికర స్థాయి కాదని స్పష్టం చేశారు. శిక్షల రేటును పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. కోర్టుల్లో సాక్షులు మాట మార్చకుండా ఉండేందుకు ఇకపై వారి వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 కింద నమోదు చేయించనున్నట్లు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: