ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యంగా అమరావతి అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సింగపూర్ ప్రభుత్వంతో భాగస్వామ్యం, అమరావతి పునర్నిర్మాణం, రాజధాని అభివృద్ధి ప్రణాళికలు, కేంద్ర సహకారం, నిధుల సమీకరణ, పారిశ్రామిక వృద్ధి తదితర అంశాలపై చర్చించబడింది.

సింగపూర్ ప్రభుత్వంతో అమరావతి అభివృద్ధి సహకారం
రాజధాని అభివృద్ధిలో భాగంగా, సింగపూర్ ప్రభుత్వం ప్రత్యేక భాగస్వామిగా ముందుకు రావడానికి ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే సింగపూర్ ప్రతినిధి బృందం అమరావతిలో పర్యటించగా, బుధవారం ఏపీ సీఎస్ విజయానంద్‌తో సమావేశమైన ప్రతినిధులు ఈరోజు (గురువారం) ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ను కలవనున్నారు. సింగపూర్ ప్రభుత్వం స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై దృష్టి సారించగా, అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టగా, వాటిలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పెంచేందుకు చర్చలు కొనసాగుతున్నాయి. ప్రతిసారి మంత్రివర్గ సమావేశానికి ముందు మంత్రులతో నారా లోకేష్ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఈరోజు కూడా ఉదయం 9 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీస్‌లో మంత్రులు బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ముఖ్యంగా అభివృద్ధి ప్రాజెక్టులు, డిజిటల్ మార్పులు, పారిశ్రామిక ప్రగతి, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై చర్చ జరిగింది.
ప్రధాని మోదీ పర్యటనపై చర్చ
రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు రంగం సిద్ధమవుతోంది. అమరావతిలో పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతారని, ఈ పర్యటనతో అభివృద్ధి ప్రణాళికలకు మరింత బలమొస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా అమరావతి మాస్టర్ ప్లాన్, నిధుల కేటాయింపు, కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉంది. రాష్ట్ర రాజధానిని బహుళ లక్ష్యపూర్వక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా, సింగపూర్ భాగస్వామ్యంతో అమరావతి అభివృద్ధికి మరింత ఊతం ఇవ్వాలని భావిస్తోంది. స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం ఆసక్తి వ్యక్తం చేయడం. అమరావతిలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు నిధుల సమీకరణ. సింగపూర్‌తో మౌళిక సదుపాయాల అభివృద్ధికి ఒప్పందాలు. అమరావతిని అంతర్జాతీయ మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్. పారిశ్రామిక వృద్ధికి సరికొత్త పెట్టుబడుల దిశగా చర్యలు. ప్రధాని మోదీ పర్యటనను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు. ఈ మంత్రివర్గ సమావేశంతో అమరావతి అభివృద్ధికి మరింత బలమొచ్చే అవకాశముంది. సింగపూర్ భాగస్వామ్యం, ప్రధాని మోదీ పర్యటనతో అమరావతికి ప్రపంచస్థాయి గుర్తింపు లభించే అవకాశముంది.