అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. కోటిపురట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాద సంఘటనలో 8 మంది మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. స్థానికులు పరుగు తీయగా, బాణాసంచా తయారీ కేంద్రం తునాతునకలై, క్షతగాత్రుల రోదనలతో భయానకంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వారికి గ్రామస్థులు సహకారం అందించారు. క్షతగాత్రులను హుటాహుటిన కోరవురట్ల పీహెచ్‌సీకి, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది అనేది ఎవరికీ స్పష్టంగా తెలియదు. విషయం తెలుసుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అలాగే ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మరణించిన మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యానికి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి మరియు విశాఖపట్నం కె.జి.హెచ్‌కు తరలించామని ఆమె తెలిపారు.
బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు
వారి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రమాద సంఘటన ప్రదేశాన్ని ఎంపీ సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ తుపాన్ సిన్హా సందర్శించారు. ఈ దురదృష్టకర సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, సహాయక చర్యలపై ఆరా తీశారని, మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆయన ప్రమాద ఘటనపై అనకాపల్లి జిల్లా అధికారులతో మాట్లాడి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సహాయక చర్యలు మరింత వేగవంతం చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోటవురట్ల బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదంపై ఇంఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో కార్మికుల మరణం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలుసుకుని అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని, ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేలుడుపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని తెలిపారు. అనకాపల్లి విషాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటనలో 8 మంది మృతి చెందడం పట్ల ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన ఘటన దురదృష్టమని, బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని ఆయన తెలిపారు. కేంద్రం తరపున మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన కుటుంబాలకు 50 వేల రూపాయలు చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారు. కాగా, మృతుల కుటుంబాలకు 15 లక్షల రూపాయలు సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
Read more : Russia: ఉక్రెయిన్‌పై దాడి 20 మందికి పైగా మృతి