ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళాగా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ‘మహాకుంభ్’ లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సోమవారంనాడు పాల్గొన్నారు. గంగా, యుమనా, సరస్వతీ నదులు సంగమించే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. దీనికి ముందు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్న అమిత్‌షాకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర మంత్రులు సాదర స్వాగతం పలికారు.
అమిత్‌షా షెడ్యూల్ ప్రకారం, బడే హనుమాన్ జీ ఆలయాన్ని సందర్శిస్తారు. జునా అఖారాను సందర్శించి అఖారా మహరాజ్, ఇతర అఖారా సాధువులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు. గురు శరణానంద్ జీ అశ్రమాన్ని సందర్శించి గురు శరణానంద్, గోవింద్ గిరి జీ మహరాజ్‌ను కలుసుకుంటారు. అనంతరం శృంగేరి, పూరి, ద్వాకరా శంకరాచార్యులను కలుసుకోవడంతో ఆయన పర్యటన ముగుస్తుంది. సాయంత్రం ప్రయాగ్‌రాజ్ నుంచి బయలుదేరి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.
మహాకుంభ కీలక రోజులు కావడంతో మహాకుంభ్ ఏరియాలో ‘నో వెహికల్ జోన్’ ప్రకటించారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకూ వెహికల్ పాస్‌లు చెల్లవని మహాకుంభ్ మీడియా సెంటర్ ప్రకటించింది. సమీపంలోని పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రమే వాహన యజమానులు పార్కింగ్ చేసుకోవాలని సూచించింది. మహాకుంభ్ భద్రతా ఏర్పాట్ల కోసం 10,000కు పైగా స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. జనవరి 29న మౌని అమావాస్య (రెండవ సాహి స్నాన్), ఫిబ్రవరి 3 వసంత పంచమి (మూడవ సాహి స్నాన్), ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26న మహా శివరాత్రి భక్తులు విశేషంగా హాజరుకానున్నారు.