అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే వలసదారులపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా వరుస యూటర్న్ లు తీసుకుంటున్నారు. ఆరంభంలో వలసదారులని వారి స్వదేశాలకు తరిమేస్తే కానీ ఊరుకోనంటూ హుంకరించిన ఆయన.. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. వలసదారుల్ని స్వదేశాలకు పంపే విషయంలో ఒక్కొక్కటిగా నిర్ణయాలు వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో వారికి ఊరట దక్కుతోంది.

వలసల వల్ల అమెరికాకు జరిగే నష్టంతో పోలిస్తే వారిని స్వదేశాలకు పంపేయడం ద్వారా ఎక్కువ నష్టం ఉంటుందని ఇప్పటికే పలువురు ఆర్ధిక వేత్తలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయినా మొదట్లో వలసల్ని యుద్ధ విమానాల్లోనే వెనక్కి పంపిన ట్రంప్.. దీంతో అవుతున్న భారీ ఖర్చును తగ్గించుకునేందుకు యూటర్న్ తీసుకున్నారు. దీంతో ఇకపై వలసల్ని ఇలా యుద్ధ విమానాల్లో కాకుండా సాధారణ విమానాల్లోనే స్వదేశాలకు తరలించే అవకాశం ఉంది.
క్రమంగా వెనక్కి తగ్గుతున్న ట్రంప్
అమెరికాలో దశాబ్దాలుగా పాగా వేసిన అక్రమ వలసదారుల్ని గుర్తించి తరిమేస్తామంటూ నానా హంగామా చేసిన ట్రంప్ ఇప్పుడు క్రమంగా వెనక్కి తగ్గుతున్నారు. ముఖ్యంగా వలసదారుల్ని మిలటరీ విమానాల్లో ఎక్కించి స్వదేశాలకు పంపేయడం ద్వారా వారి స్వదేశాలకు ఓ అలర్ట్ పంపిన ట్రంప్.. ఇప్పుడు అదే అంశంపై వెనక్కి తగ్గారు. అమెరికా మిలటరీ విమానాల్లో ఇలా వలసదారుల్ని వెనక్కి పంపడంపై వస్తున్న విమర్శలతో ట్రంప్ పునరాలోచన చేశారు.
మిలటరీ విమానాల్లో వలసల్ని భారీ ఎత్తున ఖర్చు
ఇకపై అమెరికా మిలటరీ విమానాల్లో వలసదారుల్ని స్వదేశానికి పంపరాదని ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మిలటరీ విమానాల్లో వలసల్ని భారీ ఎత్తున ఖర్చుపెట్టి వారి సొంత దేశాలకు పంపడం ఆర్ధికంగా ఇబ్బందులు సృష్టిస్తోంది. ఇందుకు అవసరమైన వ్యయం ఇచ్చేందుకు అమెరికన్ కాంగ్రెస్ నిరాకరిస్తోంది. దీంతో పాటు మిలటరీ విమానాల్లో బందీల్ని తెచ్చినట్లు తెచ్చి పారేస్తున్నారన్న ఆందోళన పలు దేశాల్లో కనిపిస్తోంది. దీంతో ట్రంప్ యూటర్న్ తీసుకోక తప్పలేదని తెలుస్తోంది.