నారా లోకేశ్ నాయకత్వంలో ప్రారంభమైన యువగళం పాదయాత్రకు నేటితో సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

2018లో చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీవరదరాజస్వామి దేవస్థానం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర 226 రోజుల పాటు కొనసాగి, 3,132 కిలోమీటర్లు నడవడంతో విశాఖపట్నం అగనంపూడిలో విజయవంతంగా ముగిసింది. పాదయాత్ర సందర్భంగా ఎదురైన ఆటంకాలు, కేసులు, దాడులని అధిగమిస్తూ నారా లోకేశ్ తన అంకితభావాన్ని నిరూపించారు. ఈ యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేశారు. పాదయాత్ర సఫలమై, ప్రజలు నారా లోకేశ్ నేతృత్వాన్ని బలంగా ఆదరించారని టీడీపీ నాయకులు అభిప్రాయపడ్డారు. యువత, మహిళలు, రైతులు, బడుగు వర్గాల అభివృద్ధికి లోకేశ్ పాటుపడుతున్నారని, ఈ యాత్ర ఆయనలోని నాయకత్వ లక్షణాలను ప్రజల ముందుకు తీసుకువచ్చిందని నేతలు కొనియాడారు.
అభివృద్ధి, సామాజిక సమానత లక్ష్యంగా లోకేశ్ ముందుకు సాగుతున్నారని, విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలిపారు. ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి కేంద్రంగా మార్చడానికి ఆయన ప్రత్యేక ప్రణాళికలతో పనిచేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అశోక్ బాబు, రాంగోపాల్ రెడ్డి, ఫైబర్ కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి తదితర ప్రముఖ నేతలు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల విజయోత్సవ సందర్భంగా యువగళం పాదయాత్ర రాష్ట్రానికి ఓ నూతన శక్తి అందించిందని, టీడీపీ భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు.