ఇప్పుడు తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి అన్నాడీఎంకే – బీజేపీ కూటమి మరోసారి అధికారికంగా కుదిరింది వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలసి పోటీకి దిగనున్నాయి.చెన్నైలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయం ప్రకటించారు పళనిస్వామి నాయకత్వంలోనే అన్నాడీఎంకే ముందుకు సాగుతుందని ఆయన స్పష్టంగా తెలిపారు.అమిత్ షా ఈ ప్రకటన చేయడానికి ముందుగా, అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 1998లో జయలలిత నేతృత్వంలో బీజేపీ–అన్నాడీఎంకే కూటమి సాధించిన విజయం గుర్తు చేశారు.అప్పట్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈ కూటమి మంచి ఫలితాలు సాధించింది.ఈసారి కూటమి కోసం అన్నాడీఎంకే ఎలాంటి షరతులు పెట్టలేదని అమిత్ షా స్పష్టం చేశారు.అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకోదని ఆయన చెప్పారు.ఇది రెండు పార్టీలకు రాజకీయంగా, ప్రజాదరణపరంగా ఎంతో ఉపయోగపడే కూటమి అవుతుందని అభిప్రాయపడ్డారు.

సీట్ల కేటాయింపు అంశం త్వరలో తేలుస్తామని కూడా తెలిపారు.ఇక రాష్ట్ర పాలనపై షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.స్టాలిన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ధ్వజమెత్తారు. పౌరుల సమస్యలు పట్టించుకోకుండా, ప్రజల దృష్టిని మరల్చేందుకు సనాతన ధర్మం, త్రిభాషా విధానం లాంటి విషయాలను ముందుకు తెస్తోందని ఆరోపించారు.ఇక బీజేపీ – అన్నాడీఎంకే పొత్తు అంటే తమిళనాడులో రాజకీయ సమీకరణలు బాగా మారతాయి. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి పెద్దగా ఆశించిన ఫలితాలు రాకపోయిన బీజేపీకి ఇది ఒక శుభసూచకం. అలాగే సింగిల్ గా పోటీచేస్తే ఓటు విడిపోతుందనే భయంతో ఉన్న అన్నాడీఎంకేకు ఇది ఓ ఊరట.ఇకపై ఈ రెండు పార్టీల కూటమి ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు వంటి విషయాల్లో మరోసారి చర్చలు జరుగుతాయి. అయితే ఇప్పుడే కూటమి ప్రకటించడమంటే, రాజకీయంగా ముందుగానే రంగంలోకి దిగడమే అని విశ్లేషకులు అంటున్నారు. ఈ పొత్తు ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎంత ఉంటుందో చూడాలి కానీ ఇప్పటికి తమిళ రాజకీయాల్లో ఈ కూటమి చర్చకు కేంద్రబిందువై ఉంది.