సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ కోసం సినీ నటుడు అల్లు అర్జున్ ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ ఘటన పట్ల సంతాపం వ్యక్తం చేసిన అల్లు అర్జున్, శ్రీతేజ్ కోసం అన్ని విధాలా సహాయపడేందుకు ముందుకొచ్చారు. ఓ ట్రస్టు ఏర్పటు చేసి దాని ద్వారా అతని వైద్యం, భవిష్యత్తు అవసరాలకు నిధులు అందజేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
అల్లు అర్జున్‌తో పాటు, దర్శకుడు సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ ట్రస్టులో భాగమవుతున్నారు. వీరు కలిసి దాదాపు రూ.2 కోట్ల నిధిని ఈ ట్రస్టులో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిధులను శ్రీతేజ్ వైద్యం కోసం మరియు భవిష్యత్తులో అతనికి అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు వినియోగించనున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై బన్నీ వ్యక్తిగతంగా దృష్టి సారించారని, అతని కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం ద్వారా అల్లు అర్జున్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.