నటుడు అక్కినేని నాగార్జున తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఆయనతో పాటు అమల అక్కినేని, అలాగే ఇటీవల పెళ్లి చేసుకున్న కొత్త జంట నాగ చైతన్య, శోభిత ధూళిపాల కూడా ప్రధానమంత్రిని కలవడానికి పార్లమెంటును సందర్శించారు. అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రపై రాబోయే పుస్తకం గురించి వారు మోదీతో చేర్చించినట్లు తెలుస్తుంది. వారి పర్యటన సందర్భంగా పార్లమెంటు ప్రాంగణాన్ని కూడా సందర్శించారు. సందర్శన అనంతరం వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ, అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రస్తావిస్తూ, భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలను ప్రశంసించారు. ఈ వ్యాఖ్యల తర్వాత, అక్కినేని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీ వెనుక మరేదైనా ముఖ్యమైన కారణం ఉందా అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. సినీ రంగానికి సంబంధించి ప్రభుత్వ సహకారం గురించి కూడా వారు చర్చించి ఉండవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. మరోవైపు, నాగ చైతన్య, శోభిత ధూళిపాల కలిసి మోదీని కలవడం ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై వీరిద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు.