తమిళ హిస్టారికల్ హారర్ ‘అగత్యా’ తెలుగులో
జీవా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ‘అగత్యా’ సినిమా తమిళ ప్రేక్షకులకు ఫిబ్రవరి 28న థియేటర్లలో అందుబాటులోకి వచ్చింది. హిస్టారికల్ హారర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రారంభంలోనే మంచి హైప్ సొంతం చేసుకుంది. అయితే, విడుదలైన తర్వాత ప్రేక్షకుల స్పందన అందుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా హారర్ సినిమాల అభిమానం ఉన్నవారిని ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.
కథ: ఓ ఆర్ట్ డైరెక్టర్, ఓ భూత్ బంగ్లా, ఓ రహస్యం
అగత్యా (జీవా) ఒక ప్రతిభావంతమైన ఆర్ట్ డైరెక్టర్. అతనికి సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్న కల ఉంది. అతని కలను సాకారం చేసేందుకు వీణ (రాశి ఖన్నా) ఎంతో ప్రోత్సహిస్తుంటుంది. ఒక సినిమా కోసం అగత్యా వేసిన గ్రాండ్ సెట్ అనుకోకుండా షూటింగ్ రద్దు కావడంతో వినియోగంలోకి రాలేదు. ఆ సెట్‌ను ఉపయోగించి కొంత సంపాదించేందుకు వీణ ఇచ్చిన ఐడియా ఆధారంగా దాన్ని ‘భూత్ బంగ్లా’గా మార్చి, టూరిస్ట్ అట్రాక్షన్‌గా ఏర్పాటు చేస్తాడు.
భూత్ బంగ్లాగా మారిన ఆ సెట్‌ను చూసేందుకు ప్రేక్షకులు భారీగా తరలివస్తుంటారు. అయితే, వారి మధ్యలో వచ్చిన ఓ యువకుడు అదృశ్యమవడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ యువకుడి అదృశ్యానికి గల కారణాన్ని వెతికే క్రమంలో అగత్యా కొన్ని షాకింగ్ నిజాలను కనుగొంటాడు. ఆ సెట్ కింద భూగర్భ రహస్య ప్రదేశం ఉందని తెలుసుకుని, దాని గురించి పరిశోధించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో 1940ల కాలానికి చెందిన ఓ డాక్టర్ అస్థిపంజరం, అతని డైరీ, ఒక పురాతన ప్రొజెక్టర్ అగత్యా చేతికి చిక్కతాయి.
ఈ ఆధారాలను పరిశీలించిన అగత్యాకు భూత్ బంగ్లా కేవలం ఒక సెట్ కాదని, అది కొన్ని దెయ్యాల నివాసమని అర్థమవుతుంది. గతంలో ఓ భారతీయ సిద్ధవైద్యుడు సిద్ధార్థ (అర్జున్) ఆంగ్లేయులతో కలసి పని చేసిన విషయం బయటపడుతుంది. కానీ, అతను ఎందుకు చనిపోయాడు? దెయ్యాలుగా మారింది ఎవరు? ఆ సెట్‌లోని రహస్యాలు ఏమిటి? అనేదే అసలు కథ.
కథనానికి కొత్తతనం ఉన్నా, రసాబాసి
సాధారణంగా దెయ్యాల కథలు కొన్ని భూత్ బంగ్లాలలో నడుస్తాయి. దెయ్యాలు ఆ భంగ్లా విడచి బయటికి రాకుండా కథను ఉంచుతారు. కానీ ‘అగత్యా’ సినిమాలో మాత్రం కాస్త భిన్నంగా ప్రయత్నించారు. హారర్ కథను ఇంగ్లీష్ కాలానికి అనుసంధానం చేసి, పాత కాలం వాతావరణాన్ని చూపే ప్రయత్నం చేశారు. కథాంశం కొత్తగా అనిపించినప్పటికీ, దాని మలుపులు ప్రేక్షకుల్ని పూర్తిగా ఆకట్టుకునేలా లేవు.
ఒక దెయ్యాల సినిమా అంటే ప్రేక్షకులు భయపడి ఆసక్తిగా చూడాలని అనుకుంటారు. హారర్ సినిమాల్లో దెయ్యాలు ఎందుకు భయపెడుతున్నాయి? వాటి ఉద్దేశం ఏమిటి? అని తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఆ ఆసక్తిని మంటగలిపేలా కథ సాగుతుంది. పాత డైరీలు, ప్రొజెక్టర్‌లు, వీడియో టేప్‌లు దొరకడం లాంటి సీన్లు ఎక్కువగా ఉంటే ప్రేక్షకుల ఆసక్తి తగ్గిపోతుంది. సినిమా మూడో భాగానికి రాగానే ఆసక్తి మసకబారుతుంది.
టెక్నికల్ పరంగా ఏముంది?
దర్శకుడు కథలో కొత్తదనం చూపించాలని ప్రయత్నించినా, ఆసక్తికరమైన మలుపులు తీసుకోలేకపోయారు. గతం-వర్తమానం మిశ్రమంగా చూపించే క్రమంలో కథనం పల్చబడిపోయింది. దెయ్యాలు కలిగించే భయం కంటే కామెడీ సీన్స్ ఎక్కువగా ఉండటంతో కథ హారర్ సినిమా అనే ట్యాగ్‌ను పూర్తిగా నెరవేర్చలేకపోయింది.
కెమెరామెన్ దీపక్ కుమార్ విజువల్స్ పరంగా బాగానే కష్టపడ్డారు. యువన్ శంకర్ రాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హారర్ ఎలిమెంట్స్‌కి తగినట్టు ఇచ్చే ప్రయత్నం చేసినా, స్క్రీన్‌ప్లే బలహీనత కారణంగా థ్రిల్ తగ్గిపోయింది. ఎడిటింగ్ పరంగా కొన్ని అనవసరమైన సీన్లను కత్తిరించాల్సిన అవసరం ఉండేది. గ్రాఫిక్స్ పరంగా మంచి క్వాలిటీ ఉన్నా, కథలో బలహీనత కారణంగా అవి వృథాగా మారాయి.