ప్రముఖ మరాఠీ నటి ప్రియా మరాఠే (Priya Marathe) ముంబైలోని తన నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 38 సంవత్సరాలు. కొద్దికాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. కొంతకాలం నటనకు దూరంగా ఉన్నారు. క్యాన్సర్ తగ్గిందని భావించి ఇటీవల తిరిగి నటన ప్రారంభించారు. కానీ, దురదృష్టవశాత్తు, వ్యాధి మళ్లీ తీవ్రం కావడంతో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.
ప్రియా మరాఠే తన నటనా జీవితాన్ని 2006లో ప్రారంభించి, టీవీ పరిశ్రమలో ఒక నటిగా తనదైన ముద్ర వేశారు. ఆమె 20కి పైగా టీవీ సీరియల్స్‌లో, రెండు చిత్రాలలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ఆమె చేసిన పాత్రలన్నీ చాలా సహజంగా ఉంటాయి. అందుకే ఆమె తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో కలిసి నటించిన ‘పవిత్ర రిష్తా’ అనే సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సీరియల్‌లో ఆమె పాత్ర చాలామంది ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రియా మరాఠే మృతి పట్ల సినీ పరిశ్రమలోని ప్రముఖులు, అభిమానులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆమె కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారు.