రన్యా రావు పై అధికారుల ప్రశ్నల వేధింపు – నటి ఆరోపణలు కన్నడ సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న నటి రన్యా రావు తాజాగా చర్చనీయాంశంగా మారారు. అక్రమ బంగారం తరలింపు కేసులో ఆమె అరెస్ట్ కావడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు విచారణ నిమిత్తం ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే తనను ప్రశ్నలతో మానసికంగా వేధించారని రన్యా కోర్టులో ఆరోపించారు.బెంగళూరులోని కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా రన్యా రావు తన అనుభవాన్ని వివరించారు. “నన్ను శారీరకంగా వేధించలేదు. కానీ ప్రశ్నలతో మానసిక ఒత్తిడికి గురి చేశారు. పదేపదే అదే ప్రశ్నలు వేస్తూ భయపెట్టేలా మాట్లాడారు” అని ఆమె పేర్కొన్నారు. అధికారులు తనను బెదిరించారని, విచారణలో ఒత్తిడి తట్టుకోలేక మానసికంగా చాలా ఇబ్బందిపడ్డానని రన్యా రావు కోర్టుకు వివరించారు.

అడిగే ప్రతి ప్రశ్నకు ఆమె మౌనం
అయితే, తాను నిర్దోషినే అని ప్రూవ్ చేసుకునేంతవరకు ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. రన్యా ఆరోపణలపై డీఆర్ఐ దర్యాప్తు అధికారులు కోర్టుకు వివరణ ఇచ్చారు. “కస్టడీలో మేము ఎలాంటి హింసకు పాల్పడలేదు. ఆమెను ప్రశ్నించేందుకు సరైన ఆధారాలు ఉన్నప్పటికీ, ఆమె సహకరించడం లేదు” అని కోర్టులో చెప్పారు.”మేము అడిగే ప్రతి ప్రశ్నకు ఆమె మౌనంగా ఉంటోంది. ఆధారాలతో సహా ప్రశ్నించినా స్పందించడంలేదు. విచారణ ప్రక్రియను రికార్డు చేశాం. కోర్టులో ఏమి మాట్లాడాలో ఆమె న్యాయవాదులు ముందుగా నేర్పించారు” అని అధికారులు కోర్టుకు వివరించారు. రన్యా రావు చేసిన ఆరోపణలపై కోర్టు కూడా కొన్ని కీలక ప్రశ్నలు వేసింది. “మీపై మాటల వేధింపులు జరిగాయని చెబుతున్నారు. కానీ, మీ న్యాయవాదులు ఎందుకు దీనిపై పిటిషన్ వేయలేదు?” అని కోర్టు నిలదీసింది.
నేను నేరం చేయలేదని ఇప్పటికే చెప్పాను అని
దీనిపై రన్యా రావు స్పందిస్తూ, నేను పూర్తిగా సహకరిస్తున్నా. కానీ, నాకు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి పేపర్లపై సంతకాలు చేయమంటున్నారు. నేను నేరం చేయలేదని ఇప్పటికే చెప్పాను అని తెలిపారు.రన్యా ఆరోపణలు, అధికారుల వివరణలపై కోర్టు సమగ్రంగా విచారించింది. తదుపరి విచారణ కోసం ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలోకి తరలించాలని నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆమెకు హితవుగా “భయపడాల్సిన అవసరం లేదు. మీకు నిజంగా అన్యాయం జరిగితే, మీ న్యాయవాదుల సహాయంతో పిటిషన్ వేయవచ్చు” అని సూచించింది. ఈ కేసు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రన్యా రావు నిజంగానే అక్రమ బంగారం కేసులో ప్రమేయముందా లేదా ఆమెను అన్యాయంగా ఇరికించారా అన్నది సమయం తేల్చాల్సిన అంశం.