బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడడంతో వెన్తనె కుటుంబసభ్యులు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం సైఫ్ కు చికిత్స అందిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ముంబై బాంద్రాలోని నివాసంలో సైఫ్ అలీఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్నాడు. ఓ దొంగ వారి ఇంట్లోకి చొరబడ్డాడు. దొంగతనానికి యత్నించాడు. అలికిడి కావడంతో సైఫ్ మేల్కొని దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో దొంగ సైఫ్ పై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారు అయ్యాడు. ఈ దాడిలో సైఫ్ కు ఆరు చోట్ల గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సైఫ్ నివాసానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంటి చుట్టూ అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో సైఫ్ భార్య, హీరోయిన్ కరీనా కపూర్, పిల్లలు క్షేమంగా ఉన్నారు.
బాలీవుడ్ టాప్ హీరోల్లో సైఫ్ ఒకరు. ఆయన ఎన్నో సూపర్ హిట్ మూవీల్లో నటించారు. హీరోగానో కాకుండా విలన్‌గా పలు బాషల్లో నటించారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రంలో రావణుడిగా కనిపించారు. ఇక గతేడాది ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో విలన్‌గా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సైఫ్ పై దాడి ఘటన తెలుసుకున్న సినీ ప్రముఖులు , అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.