AP Cabinet : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఈరోజు (మంగళవారం) కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించి అమోదం తెలుపనుంది. సీఆర్డీఏ 46వ ఆధారిటీలో అమోదించిన అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు ఓకే చెప్పనుంది. ఐదో ఎస్ఐపీబీ సమావేశంలో అమోదించిన పెట్టుబడులకు ఓ నిర్ణయం తీసుకోనుంది.

పలు కంపెనీల పెట్టుబడులకు మంత్రిమండలి ఆమోదం
కొత్తగా రూ.30,667 కోట్లు పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు వచ్చే ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీ ఏర్పాటుతో సహా పలు కంపెనీల పెట్టుబడులకు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూకేటాయింపులకు అమోదించనుంది. ఉండవల్లి, పెనుమాక రైతులకు జరీబు భూములకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే అంశంపై అథారిటీ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదించనుంది. ఏపీ మంత్రి మండలి సమావేశంలో కుప్పం నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది.
ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు భూములను కేటాయిస్తూ నిర్ణయం
నెల్లూరులో ఏపీఐఐసీకి, విజయనగరం జిల్లాలో గ్రే హౌండ్స్‌కు గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు కేబినెట్‌లో భూములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందుగా నాలా ఫీజు రద్దు అంశాన్ని కేబినెట్‌లో ఈ సారి ఉంచాలని మంత్రి మండలి భావించింది. అయితే ఆ శాఖను చూసే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా బదిలీ కావడంతో ఈ సారి కేబినెట్‌లో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉండకపోవచ్చని సమాచారం.
Read Also: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్