బక్రీద్ (Bakrid ) పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ (AP State Animal Husbandry Department) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆవులు, దూడలు, ఒంటెలను వధించడంపై గట్టి నిషేధం అమలులో ఉందని శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు స్పష్టం చేశారు. జంతు సంరక్షణ చట్టాలు, గోవధ నిషేధ చట్టాల ప్రకారం ఈ జంతువుల వధ చట్టపరంగా నిషిద్ధమని తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఈ నిబంధనలను కొంతమంది ఉల్లంఘించే ప్రమాదం ఉన్నందున ముందస్తు హెచ్చరికలు ఇచ్చారు.
ఎక్కడైనా చట్ట ఉల్లంఘన జరిగితే చర్యలు
పండుగ సందర్భంగా శాంతిభద్రతలు కొనసాగేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అన్ని జిల్లా మరియు మండల స్థాయి పశుసంవర్ధక అధికారులు, పోలీస్ విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా చట్ట ఉల్లంఘన జరుగుతున్న సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలంతా చట్టాలను గౌరవించి సహకరించాలని, వివాదాలు లేకుండా పండుగ జరుపుకోవాలని సూచించారు.
హింస నివారించి, సామాజిక సమరసతను కాపాడుకోవాల్సిన బాధ్యత
ఇక ప్రజలు స్వచ్ఛందంగా చట్టాలను పాటించి, నిషేధిత జంతువుల వధకు పాల్పడకూడదని పశుసంవర్ధక శాఖ కోరుతోంది. పండుగ శుభసందర్భంలో హింస నివారించి, సామాజిక సమరసతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని దామోదర్ నాయుడు అన్నారు. జంతు హక్కులు, చట్ట నిబంధనలు పాటించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Read Also : Hyderabad : ట్రాలీ బ్యాగ్ హత్య కేసులో నిందితుడిని గుర్తించిన పోలీసులు