ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఆయన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎదుర్కొన్న అనుభవాలు, తాజా రాజకీయ పరిణామాలు ఈ నిర్ణయానికి దారితీశాయి. ఆయన రాజకీయ ప్రవేశం ఒక ‘స్పాంటేనియస్ డెసిషన్’ కాదు అని, దీని వెనుక రాజకీయ వ్యూహాలు, సామాజిక వర్గ సమీకరణలు, గత జ్ఞాపకాలు, ఇంకా చంద్రబాబు-జగన్ మధ్య సాగుతున్న దురంధర పోరాటంతో ముడిపడిన అనేక కీలక అంశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది.

ఏబీవీ – అధికారంలో కీలక పాత్రధారి
ఏబీ వెంకటేశ్వరరావు పేరు రాష్ట్ర రాజకీయాల్లో తొలిసారిగా హైలైట్ అయినది టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఉన్నప్పుడు. అప్పట్లో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి, బెదిరించి టీడీపీలోకి రప్పించారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దీనివల్ల వైసీపీకి, ముఖ్యంగా జగన్ కు ఆయనపై తీవ్ర ఆగ్రహం ఉన్నట్టు చెబుతారు. చంద్రబాబు హయాంలో ఏబీ చేసిన ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు రాజకీయంగా వైసీపీని బలహీనపరచడం లక్ష్యంగా జరిగాయని విమర్శలు ఉన్నాయి.
వైసీపీ అధికారంలోకి రాగానే మొదలైన ఎదురుదాడి
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే, పాత విషయాల్ని పునర్విమర్శించిన వైసీపీ ప్రభుత్వం, ఏబీవీపై వివిధ కేసుల వేట ప్రారంభించింది. నిఘా పరికరాల వాడకంపై, అధికార బేధభావంపై కేసులు పెట్టి చివరికి ఆయన్ని సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన ఏబీవీ, న్యాయబద్ధంగా సుదీర్ఘ పోరాటం చేసి ఊపిరి పీల్చుకున్నారు. కానీ రాజకీయంగా ఆయనపై మచ్చ మాత్రం చెరగలేదు.
కూటమి ప్రభుత్వంలో గౌరవం రాకపోవడం వల్లే రాజకీయ ప్రవేశమా?
ఇటీవలే ఏర్పడిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఏబీకి కీలక పదవి దక్కుతుందని అనుకున్నారు. కానీ చంద్రబాబు ఆయన్ని పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి పరిమితం చేశారు. ఇది ఏబీకి నచ్చక, అవమానంగా భావించి పదవిని స్వీకరించకపోవడం రాజకీయ రంగప్రవేశానికి ముందస్తు సంకేతంగా అభివర్ణించవచ్చు. కమ్మ సామాజిక వర్గ సమావేశాల్లో ఏబీ చేసిన వ్యాఖ్యలు, సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తిని బయటపెట్టినట్లే కనిపించాయి.
చంద్రబాబు సీఎంగా ఉండి చేయలేకపోతున్న పనిని ఏబీవీ ద్వారా చేయిస్తున్నారా అనే ఓ చర్చ సాగుతోంది. మరోవైపు చంద్రబాబు చేయలేని పని చేయడం ద్వారా తన సొంత సామాజిక వర్గాన్ని సంతృప్తి పర్చేందుకు ఏబీనే స్వయంగా రంగంలోకి దిగారన్న మరో ప్రచారం కూడా జరుగుతోంది. అయితే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఏబీ చెప్పినా ఇప్పట్లో ఆయన స్వయంగా పార్టీ పెట్టే పరిస్ధితి లేదు. అలాగే టీడీపీలో చేరే పరిస్ధితి కూడా లేదు. కాబట్టి టీడీపీ బాటలోనే వెళ్తూ జగన్ ను టార్గెట్ చేయడం ద్వారా సొంత సామాజిక వర్గ నాయకుల్ని వారి నిధులతోనే సంతృప్తి పర్చేందుకు ఏబీ ప్రయత్నిస్తారని తెలుస్తోంది.
Read also: AP ఇంటర్ ఫలితాల్లో నారాయణ విద్యార్థుల ఆధిపత్యం