పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ నియోజకవర్గ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్రోత్ బస్సి గోగీ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో తన ఇంట్లో గన్‌షాట్‌కు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆయన తన గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ప్రమాదవశాత్తు మిస్‌ఫైర్ జరిగి చనిపోయారా? అన్న అనుమానాలపై స్పష్టత కోసం పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. గన్‌షాట్ వివరాలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే ఇంటి పరిసరాలను పోలీసులు తనిఖీ చేశారు.
గుర్రోత్ బస్సి గోగీ అనారోగ్య సమస్యలు లేదా వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందా? లేక ఈ ఘటనకు వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇంకా ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
గోగీ మృతితో లూథియానాలో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పంజాబ్ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. MLA గోగీ మృతి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.