గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ విషయం బయటకు
న్యూఢిల్లీ: పంజాబ్‌లో మంత్రి కుల్దీప్ సింగ్ ధలివాల్ ఇరవై నెలలకు పైగా ఉనికిలో లేని పరిపాలనా సంస్కరణల విభాగానికి నాయకత్వం వహించారు. దీన్ని సవరించేందుకు పంజాబ్ ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ విషయం బయటపడింది. మూడేండ్ల క్రితం పంజాబ్‌లో భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2023లో మంత్రివర్గ పునర్వవస్థీకరణ చేపట్టింది.

మరోసారి పునర్వ్యవస్థీకరణ
ఇందులో భాగంగా ఆప్ సీనియర్ నేతల్లో ఒకరైన కుల్‌దీప్ సింగ్ ధలివాల్ కు రెండు శాఖలు ఎన్ఆర్ఐ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలు అప్పగించింది. 2024 సెప్టెంబర్‌లో మరోసారి పునర్వ్యవస్థీకరణ జరిపింది. అవే శాఖలు ఆయనకు కొనసాగించింది. అయితే, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ ఉనికిలో లేదని గ్రహించి తాజాగా మార్పులు చేసింది.
ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
పంజాబ్‌లో పాలనను ఆప్ ఒక జోక్‌లా మార్చింది
అయితే ఇదెక్కడి విడ్డూరం అంటూ స్థానిక రాజకీయ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ అంశంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. పంజాబ్‌లో పాలనను ఆప్ ఒక ‘జోక్’లా మార్చేసిందంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఉనికిలో లేని శాఖకు 20 నెలలుగా మంత్రి బాధ్యతలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. లేని శాఖను ఒక మంత్రి నిర్వహిస్తున్నారనే విషయం ముఖ్యమంత్రికి తెలియకపోవడం.. అక్కడ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.