వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన వైమానిక ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన వాషింగ్టన్ విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మరణించినట్టు అమెరికా ప్రకటించింది. వాషింగ్టన్ లోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్ పోర్టులో అమెరికన్ ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ని గాలిలోనే ఢీ కొట్టింది. దీంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది.

మిడ్ ఎయిర్ లో విమానం-హెలికాప్టర్ ఢీ కొని సమీపంలోని ఫోటో మాక్ నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 28 మృతదేహాలను వెలికి తీశారు. హెలికాప్టర్ లోని మొత్తం సిబ్బందితో పాటు విమానంలోని ప్రయాణికులు మొత్తం 67 మంది మరణించినట్టు సీనియర్ అగ్నిమాపక అధికారి తెలిపారు. తాము ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ నుంచి మృతదేహాల రికవరీ ఆపరేషన్ కి మారుతున్న దశలో ఉన్నామని వాషింగ్టన్ అగ్నిమాపక అధికార జాన్ డొన్నెల్లీ విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు.
కాగా, వాషింగ్టన్ డీసీ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఓ చిన్న విమానం, హెలికాప్టర్ ను గగన తలంలో ఢీకొని పక్కనే ఉన్న పొటోమాక్ నదిలో కుప్పకూలాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ వాన్స్ విచారం వ్యక్తం చేశారు. రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో జరిగిన ప్రమాదం గురించి అధికారులు తనకు వివరించారన్నారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని పర్యవేక్షించడంపై ఓ ప్రకటనలో స్పందించారు.