మహాబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి శివారు సక్రాంనాయక్ తండాలోని డీఎన్టీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. స్కూల్‌లో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ధరంసోతు శ్రీనుపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ స్కూల్‌కు ఆరు నెలల క్రితం బదిలీపై వచ్చిన ధరంసోతు శ్రీను విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెల్లడైంది. స్కూల్ టైంలో సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు, వీడియోలు చూపడం, తక్కువ వయసు బాలికలను తన దగ్గరకు రావాలని బెదిరించడం వంటి చర్యలతో విద్యార్థినులను భయపెట్టాడు. తమ పిల్లల నుంచి ఉపాధ్యాయుడి ప్రవర్తన గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకున్నారు. ఉపాధ్యాయుడిని నిలదీసి, ఆగ్రహంతో కొందరు అతడిపై చేయిచేసుకున్నారు. గ్రామస్తులు కూడా స్కూల్‌కు చేరుకుని పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
సీరోలు ఎస్సై ఈ విషయంపై స్పందించి ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు. కేసు విచారణ నిమిత్తం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘటనపై మరింత సమాచారం సేకరిస్తున్నారు. విద్యార్థులకు మంచి బుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడి దుర్గుణం సభ్య సమాజానికి తలవంచుకునేలా చేసింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, విద్యా శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.