ఆంధ్రప్రదేశ్‌లో మరో స్టేడియం నిర్మించనున్నారు. ఈ మేరకు మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నంలో దివ్యాంగుల కోసం రూ.200 కోట్లతో 20 ఎకరాల్లో స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు. అమరావతిలో మంత్రితో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని రాష్ట్ర పారా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ 2025 పోటీలకు ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని.. దివ్యాంగులకు పింఛన్‌ను రూ.3 వేల నుంచి ఒకేసారి రూ.6 వేలకు పెంచిందని.. మంచానికే పరిమితమైన వారికి నెలకు రూ. 15,000 ఇస్తున్నామని గుర్తు చేశారు. అలాగే దివ్యాంగ విద్యార్థులకు పింఛన్ డబ్బుల్ని ప్రతినెల వారి బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేస్తున్నామన్నారు. అలాగే దివ్యాంగ విద్యార్ధులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు, త్రీ వీలర్స్ అందజేస్తున్నామన్నారు.
![](https://vaartha.com/wp-content/uploads/2025/01/dola-bala-1024x614.jpg.webp)
విశాఖపట్నంలో ఇప్పటికే క్రికెట్ స్టేడియం ఉంది.. నగరంలో మరో స్టేడియం కూడా ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది.. భోగాపురంలో కూడా క్రికెట్ స్టేడియం ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడు మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి కూడా దివ్యాంగులకు స్టేడియం నిర్మిస్తామని చెప్పారు. మరోవైపు ఈనెల 31 నుంచి వచ్చేనెల 2 వరకు నిర్వహించనున్న అరకు ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.కోటి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు తిరుపతి జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఫ్లెమింగో ఉత్సవాలకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. అలాగే సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 285వ జయంతి వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసింది. ఈ వేడుకలను ఫిబ్రవరి 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తారు.