Ayodhya : చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరాముడు జన్మించాడు కాబట్టి ఆ ఆదర్శ శ్రీరాముని జన్మదినమే శ్రీరామనవమిగా జరుపుకుంటారు. అదే రోజున సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రేపు(ఆదివారం) శ్రీ రామనవమి పండుగను యావత్ దేశం అంగరంగా వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నవమి సందర్భంగా శ్రీరామ జన్మభూమి అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. బాలరామునికి సూర్యభగవానుడు సూర్య తిలకం దిద్దుతున్నారా అన్నట్లు దృశ్యాలు కనిపిస్తాయి.

సూర్యభగవానుడు బాలరాముడికి తిలకమై మెరవనున్నాడు
ఈ నేపథ్యంలో లోకానికి వెలుగు ఇచ్చే సూర్యభగవానుడు రేపు(ఆదివారం) బాలరాముడికి తిలకమై మెరవనున్నాడు. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఈ అద్భుత దృశ్యాలు రేపు మధ్యాహ్నం 12 గంటలకు కనువిందు చేయనుంది. ఇదిలా ఉంటే.. గత ఏడాది శ్రీరామనవమికి తొలిసారి ఆదిత్య భగవానుడు బాలరాముడిని నుదిటిని తాకిన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది శ్రీరామనవమికి బాలరాముడి నుదిటి పైకి భానుడి కిరణాలు ప్రసరించేలా ఆలయం నిర్మించారు. కాంతి గుడి శిఖరాన్ని తాకే మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని విగ్రహాన్ని చేరేలా కుంభాకార, పుటాకార కటకాలు అమర్చారు. ఇక పోతే ఈ ఏడాది(రేపు) ఆవిష్కృతం అవ్వబోతున్న ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అంతేకాదు ఈ అద్భుతాన్ని చూసేందుకు భారీగా రాములోరి భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు.