బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క సంక్షేమ పథకాల హామీ రాష్ట్రంలో అమలు కావడం లేదని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. గజ్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లో జహీరాబాద్ బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని వెల్లడించిన కేసీఆర్.. రాబోయే రోజుల్లో విజయం మనదేనని తెలిపారు. బీఆర్ఎస్ విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలని చెప్పారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు.

తాను కొడితే మామూలుగా ఉండదని.. గట్టిగా కొట్టడం తనకు అలవాటు అని కేసీఆర్ పేర్కొన్నారు. తాను గంభీరంగా, మౌనంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నానని తెలిపారు.
ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వాళ్లు కనిపిస్తే.. ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని వివరించారు.