తరగతి గదిలోనే స్టూడెంట్‌ను ఓ మహిళా ప్రొఫెసర్ వివాహం చేసుకుంటున్న వీడియో ఒకటి కలకలం రేపుతోంది. విస్మయానికి గురిచేసే ఈ ఘటన పశ్చిమ్ బెంగాల్‌లోని నాడియా జిల్లా హరిన్‌ఘటాలో ఉన్న మౌలానా అబుల్‌కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో చోటుచేసుకుంది. ఓ సీనియర్ మహిళా ప్రొఫెసర్.. స్టూడెంట్ ‘పెళ్లిచేసుకున్నట్టుగా’ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటనపై విచారణకు యూనివర్సిటీ ఆదేశించింది. ఆమె నుంచి వివరణ కోరిన అధికారులు.. విచారణ ముగిసే వరకూ సెలవుపై వెళ్లాలని కోరింది. అయితే, దీనిపై స్పందించిన ఆ ప్రొఫెసర్ తన క్లాసులో భాగమైన సైకో డ్రామా ప్రదర్శన అని తెలిపారు. ఇది ప్రాజెక్ట్‌లో భాగంగానే జరిగిందని చెప్పారు.
ఇక, విద్యార్థికి కూడా ఇదేవిధంగా తెలిపారు. అయితే, వీడియోలో మాత్రం వధువు అలంకరణలో ఉన్న ప్రొఫెసర్‌కు, ఫస్టియర్ స్టూడెంట్‌తో జరిగిన ఈ తంతులో హిందూ బెంగాలీ వివాహ సంప్రదాయం ప్రకారం.. ‘సిందూర్ దాన్’, ‘మాలా బదలా’ (దండలు మార్చుకోవడం) వంటి క్రతువులన్నీ కనిపిస్తున్నాయి. అలాగే, ముగ్గురు సాక్షి సంతకాలు చేసి.. ధ్రువపత్రం అందజేయడం అందులో ఉంది.
మహిళా ప్రొఫెసర్ మాట్లాడుతూ.. ప్రెషర్స్ పార్టీ సందర్భంగా చేపట్టిన ప్రాజెక్ట్‌లో ఇది భాగమని, దీనిని తప్పుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. తన ప్రతిష్ఠను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా వీడియోను లీక్ చేశారని ఆరోపించారు. దీనికి బాధ్యులపై పోలీసు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. కానీ, డిజిటల్ ఆహ్వాన పత్రికను ముద్రించి.. అందులో జనవరి 9న హల్దీ, జనవరి 14న మెహందీ, సంగీత్, జనవరి 20న వివాహంగా పేర్కొనడం గమనార్హం.
యూనివర్సిటీ తాత్కాలిక వైస్-ఛాన్సలర్ తపస్ చక్రవర్తి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ దర్యాప్తునకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. వివాదం రేగడం, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో కమిటీ తన నివేదిక సమర్పించే వరకు ప్రస్తుతానికి సెలవులో వెళ్లాలని మేం ఆమెను కోరాం” అని స్పష్టం చేశారు. అయితే, ఇతర ప్రొఫెసర్లు మాత్రం ఇటువంటి చర్యలను అకడమిక్ ప్రాజెక్ట్‌లో భాగమని సమర్ధించలేమని అన్నారు. ఆమె వివరణపై అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే, యూనివర్సిటీ టీచర్స్ యూనియన్ సైతం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.