हिन्दी | Epaper

fresh water :స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

Sudha
fresh water :స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

ప్రకృతిలోని ప్రతి జీవికి నీరు ప్రాణాధారం. కానీ కోట్లాది ప్రజలు నివసించే ఆధునిక సమాజాల్లో కూడా స్వచ్ఛ మైన తాగునీరు అందించడం ఇంకా పెద్ద సవాలుగానే మిగి లింది. గ్రామాల నుంచి మహానగరాల వరకు
పరిశుభ్రమైన నీటి సరఫరా వ్యవస్థలు పలు చోట్ల విఫలమవుతున్నాయి. అధిక జనాభా, బలహీనమైన మౌలిక వసతులు, పరిపాల నా నిర్లక్ష్యం కలిసి ఈసమస్యను తీవ్రమైన ప్రజారోగ్య సంక్షో భంగా మారుస్తున్నాయి. స్వచ్ఛమైన తాగునీటిని (fresh water)పొందడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని భారత అత్యున్నత న్యాయస్థానం పలుమార్లు స్పష్టం చేసింది. జీవించే హక్కులో పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకర వాతావరణం అంత ర్భాగమని కూడా పేర్కొంది. అయితే ఈ గొప్ప మాటలు చాలా వరకు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వా ల స్థానిక సంస్థల అలసత్వం, పర్యవేక్షణ లోపాలు కలిసి తాగునీటిని విషతుల్యంగా మార్చుతున్నాయి. దేశ వ్యాప్తంగా తరచూ వెలుగుచూస్తున్న డయేరియా, కలరా, లెప్టోస్పైరో సిస్ వంటివ్యాధుల కేసులు ఈ వైఫల్యానికి నిలుస్తున్నాయి. వేసవి కాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ సమస్య మరింత తీవ్రతరమవుతోంది. బెంగళూరు, గాంధీనగర్, గ్రేటర్ నోయిడా వంటి మహానగరాల నుంచి హైదరాబాద్, ఆదిలాబాద్, విజయవాడ, గుంటూరు, ఆళ్లగడ్డ వంటి పట్ట ణాల వరకు తాగునీటి కాలుష్యం ప్రజారోగ్యాన్ని సంక్షోభం లోకి నెడుతోంది. మలిన జలాల కారణంగా విజయనగరం జిల్లాలో డయేరియా విజృంభించగా, తాజాగా శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో పాతబడిన పైపైన్లు పగుళ్లబారిపోయి డ్రైనేజీల్లోంచి వెళ్తు న్నాయి. దీంతో మురుగు నీరు తాగునీటిలో కలవడం సాధారణమైపోయింది. బోర్ల చుట్టూ చెత్త పేరుకుపోవడం, నీటి ట్యాంకులు శుభ్రం చేయకపోవడం, క్లోరినేషన్ సక్రమంగా జరగకపోవడం వంటి నిర్లక్ష్యాలు ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి.

Read Also: West Bengal Weather: బెంగాల్‌లో మారుతున్న వాతావరణం

fresh water
fresh water

గణాంకాలు పరిస్థితి తీవ్రతను మరింత స్పష్టంగా తెలియజేస్తున్నాయి. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా దాదాపు 1.54 కోట్ల డయేరియా కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 3.95 లక్షలు, తెలంగాణలో 3.29 లక్షల కేసులు నమోదవడం ఆందోళనకరం. 2021లో 217కలరా కేసులు నమోదవగా, గత ఏడాదికి అవి 22 రెట్లుపెరగడం పరిస్థితి నియంత్రణలో లేదని సూచిస్తోంది. లెప్టో స్పైరోసిస్ కేసులు కూడా గణనీయంగా పెరిగాయి. అపరిశుభ్రమైననీటి వల్ల ఏటా కోట్లాది మంది అనారోగ్యానికి గురవుతున్నారని అంచనాలు చెబుతున్నాయి. ప్రతి ఇంటికీ శుద్ధమైన నీరు (fresh water) అందిస్తే లక్షలాది అర్ధాంతర మరణాలను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. అయినప్ప టికీ పాలకుల అలక్ష్యం మారడం లేదు. వేసవి కాలంలో బ్యాక్టీరియా వేగంగా వ్యాపించే అవకాశం ఎకువగా ఉం టుంది. అందువల్ల నీటి శుద్ధిచర్యలు మరింత కట్టుదిట్టంగా ఉండాలి. కానీ అనేక ప్రాంతాల్లో నీటినమూనాల పరీక్షలు కూడా సక్రమంగా జరగడం లేదు. ఇటీవల నిర్వహించిన సర్వే లోగృహాలకు సరఫరా అవుతున్న నీటిలో దాదాపు 24శాతం నమూనాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. 485 పట్టణాల్లో కేవలం 46ప్రాంతాల్లో మాత్రమే నాణ్య మైన నీరు అందుతున్నట్లు వెల్లడైంది. ఒకవైపు దేశం అంత రిక్షరంగంలో విజయాలను సాధిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కీలక స్థానాన్ని సంపాదిస్తోంది. కానీ అదే సమ యంలో ప్రాథమికమైన తాగునీటి భద్రతను నిర్ధారించలేకపో వడం అభివృద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. సాంకేతికంగా ముందంజలో ఉన్న దేశం ప్రజలకు సురక్షిత తాగునీరు అందించలేకపోతే ఆ పురోగతికి అర్థమేంటి? ఈ సమస్యకు పరిష్కారం అసాధ్యం కాదు. నీటి సరఫరా వ్యవస్థలను సమగ్రంగా పునరుద్ధరించడం అత్యవసరం. పాతపైపైన్లను తక్షణమే మార్చాలి. డ్రైనేజీ, మంచినీటి లైన్లను వేరు చేసి సాంకేతికంగా బలోపేతం చేయాలి. నీటి ట్యాంకుల శుభ్రత, క్లోరినేషన్, నాణ్యత పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలి. ప్రతిమునిసిపాలిటీ, పంచాయతీ స్థాయిలో నీటి నాణ్యత పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసి పరీక్షా ఫలితాలను ప్రజలకు పారదర్శకంగా వెల్లడించాలి.

fresh water
fresh water

గ్రామీణ ప్రాంతాల్లో బోర్లచుట్టూ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి. స్వచ్ఛతా కార్య క్రమాలకు పెట్టే ప్రతిరూపాయి ఆరోగ్య వ్యయాలను తగ్గించి సమాజానికి అనేక రెట్లులాభం చేకూరుస్తుందని అంచనాలు చెబుతున్నాయి. అంటే ఇది ఖర్చుకాదు దీర్ఘకాలిక పెట్టుబడి. ప్రజారోగ్యంపై పెట్టుబడి పెట్టడం ద్వారా వైద్య ఖర్చులు తగ్గుతాయి. పనిదినాల నష్టం తగ్గుతుంది, ఉత్పాదకత పెరు గుతుంది. దేశ ఆర్థికాభివృద్ధికీ ఇదికీలకం. ఇదే సమయంలో జల వనరుల సంరక్షణ కూడా సమానంగా ముఖ్యమైనది. పూడుకుపోయిన కుంటలు, చెరువులను పునరుద్ధరించడం, అడవులను పెంచడం, వాన నీటి సంరక్షణను తప్పనిసరి చేయడం వంటి చర్యలు చేపట్టాలి. నగరాల్లో కురిసే వాన నీరు డ్రైనేజీల్లోకిపోకుండా భూగర్భంలోకి ఇంకేలా వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. గ్రామస్థాయిలో నీటి కుంటలు, చెరువుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. సేంద్రియ వ్యవసాయం వంటి పద్ధతుల ద్వారా నీటి వినియోగాన్ని కూడా సమతుల్యం చేయాలి. స్వచ్ఛమైన నీరు కేవలం ఒక సేవ కాదు, అది జీవనాధారం. దాన్ని అందించడం ప్రభుత్వాల రాజ్యాంగ బద్ధ కర్తవ్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నిధులు, సాంకే తిక సహకారం అందించాలి. స్థానికసంస్థలు బాధ్యతాయు తంగా వ్యవహరించాలి. ప్రజలు కూడా నీటివనరుల సంరక్ష ణలో భాగస్వాములు కావాలి. సాంకేతికంగా గానీ, పలురంగా ల్లో గానీ అభివృద్ధి ఎంత సాధిస్తున్నా, తాగునీరు కలుషితమై ప్రజలు ప్రాణాలు కోల్పోతే ఆ పురోగతికే విలువ ఉండదు. జీవించే హక్కు సజీవ సత్యంగా నిలవాలంటే ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందాలి. అదే నిజమైన అభివృద్ధి.
-ముద్దం నరసింహ స్వామి

Read hindi news : hindi.vaartha.com

Epaper :epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870