Telangana education department: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తెలుగుభాషాభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయం మాతృభాషాభిమానులకు ఆనందాన్ని కలిగించింది. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేయడం మరుగున పడుతున్న ప్రాంతీయ భాషకు పట్టం కట్టినట్టు చెప్పవచ్చు. తెలంగాణలో అనేక మంది విద్యావంతులు కనీసం తెలుగు పదాలు కూడా చదవలేని స్థితిలో ఉన్నారు. దీనికి కారణం ప్రాథమిక స్థాయి నుంచి తెలుగును సబ్జెక్ట్ తీసుకోకపోవడం. భాష సబ్జెక్ట్ ఎంపిక విషయంలో ఆప్షన్స్ ఉండటంతో వేరే భాషల్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. హైస్కూలు చదువు పూర్తి చేసి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సంపాదించిన వారు సైతం తెలుగును చదవలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రపంచ దేశాల్లోనే తెలుగుభాషకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తగిన ఆదరణ లేకుండా పోతోంది. తెలుగు చదవడం వల్ల ప్రయోజనం ఉండదన్న భావన విద్యార్థుల్లోను, వారి తల్లిదండ్రుల్లోను పెరిగిపోతోంది. తెలుగు, భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజభాష, ‘త్రిలింగ పదం నుంచి ‘తెలుగు’ పదం వెలువడిందని అంటారు. తేనె ఎంత తీపిగా ఉంటుందో తెలుగు మాట్లాడితే అదేవిధంగా తేనెలూరుతుందన్న భావన కలుగుతుంది. కనుక ‘తెనుగు’ అని గుర్తించబడింది. తెన్ అంటే దక్షిణము, దక్షిణ దిక్కుకు చెందిన భాష తెనుగు, అదే తెలుగుగా మారిందని కూడా చెబుతుంటారు. క్రీ.పూ.400 నాటి శిథిలాలలో తెలుగు భాష ఉండటాన్ని బట్టి ఈ భాష ప్రాచీనత మనకి తెలుస్తోంది.
Read Also: Digital Crime India:దేశంలో డిజిటల్ అరెస్టుల జోరు

ప్రతి ఒక్కరూ తెలుగు భాష గర్వకారణమని చెబుతారేగానీ ఆచరించడంలో మాత్రం పక్క భాషల వైపు చూస్తారు. దీనితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగును తప్పనిసరి చేస్తేనే ప్రయోజనం ఉంటుందని గుర్తించి ఆ విధంగా చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో మాతృభాష తెలుగుకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ తరాలకు తెలుగు భాషా సౌరభాన్ని అందించడమే లక్ష్యంగా, వచ్చే 2026-27 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగును కచ్చితంగా ఒక సబ్జెక్టుగా బోధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం స్టేట్ బోర్డు పాఠశాలలకే పరిమితం కాకుండా, కాకుండా, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి అంతర్జాతీయ ప్రమాణాలతో నడిచే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లోనూ మాతృభాషను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం అనేక కార్పొరేట్ పాఠశాలల్లో మార్కుల వేటలో పడి తెలుగును విస్మరిస్తున్న సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం స్కోరింగ్ కోసమే అరబిక్, సంస్కృతం, ఫ్రెంచ్ వంటి భాషలకు ప్రాధాన్యతనిస్తూ, తెలుగును ఆటకెక్కిస్తున్న తీరుపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు కనీసం తెలుగులో చిన్న వాక్యాన్ని కూడా సరిగ్గా చదవలేకపోవడం భాషా సంక్షోభానికి దారితీస్తోందని గుర్తించిన సర్కారు, తెలుగు తప్పనిసరి అమలు చట్టం 2018ని కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. గతంలో కోవిడ్ కారణంగా 9,10 తరగతులకు ఇచ్చిన మినహాయింపులను రద్దు చేస్తూ, 2025-26లో 9వ తరగతికి, 2026-27 నాటికి 10వ తరగతికి ఈ నిబంధనను వర్తింపజేయనుంది. కాగా, విద్యార్థులపై పనిభారం పడకుండా ప్రభుత్వం ఒక వినూత్న మార్పును ప్రవేశపెట్టింది.

Telangana education department: ఇతర బోర్డుల విద్యార్థుల కోసం కఠినమైన సింగిడి పుస్తకాలకు బదులుగా, అత్యంత సరళంగా ఉండే వెన్నెల పాఠ్యపుస్తకాలను రూపొందించింది. కేవలం ఇతర రాష్ట్రాల నుండి వచ్చి 8వ తరగతి ఆపై తరగతుల్లో చేరే విద్యార్థులకు మాత్రమే ఈ నిబంధన నుండి మినహాయింపు ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై భారీ జరిమానాలు విధిస్తామని, చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రతి పాఠశాల తగినంత మంది తెలుగు ఉపాధ్యాయులను నియమించుకోవాలని, ఎస్సీఈఆర్టీ నిర్దేశించిన పుస్తకాలనే బోధించాలని స్పష్టం చేయడంతో, రాష్ట్రవ్యాప్తంగా తెలుగు భాషకు కొత్త ఊపిరి పోసినట్లయింది. తెరమరుగౌతున్న తెలుగు భాషకు తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసకున్న నిర్ణయం మాతృభాషపై మక్కువ ఉన్న వారికి ఆనందాన్ని కలిగిస్తుండనడంలో సందేహం లేదు.
Hindi: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: