దేశ భవిష్యత్తు తరగతి గదులలోనే రూపుదిద్దుకుంటుంది అన్నది కేవలం భావోద్వేగ నినాదం కాదు, నిర్ధారిత సత్యం. కానీ ఆ సత్యాన్ని మన పాలక వ్యవస్థలు ఎంత వరకు గుర్తిస్తున్నాయో ప్రతి ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్‌నే అద్దంలా చూపిస్తుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం 53.47 లక్షల కోట్ల రూపాయలు. అయితే ఈ మహత్తర బడ్జెట్లో విద్యారంగానికి (Education) కేటాయించిన మొత్తం కేవలం 1,39,289 కోట్ల రూపాయలు మాత్రమే. శాతాల పరంగా ఇది దాదాపు 2.6 శాతం మాత్రమే. ఈసంఖ్యలు చూస్తే దేశాభివృద్ధిలో విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత ఎంత పరిమితమో స్పష్టంగా అర్థమవుతుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రతి ప్రభుత్వం విద్యను జాతి నిర్మాణానికి పునాదిగా అభివర్ణిస్తూ వచ్చింది. కానీ ఆ మాటలకు ఆర్థిక ప్రాధాన్యత ఇచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వాలు వరుసగా విఫలమవు తున్నాయి. ముఖ్యంగా 1964-66 మధ్యకాలంలో పని చేసిన కొఠారి కమిషన్ దేశ విద్యావ్యవస్థను సమగ్రంగా అధ్యయనం చేసి, జాతీయ ఆదాయంలో కనీసం 6 శాతం విద్యకు(Education) కేటాయించాలి అని స్పష్టంగా సిఫారసు చేసింది. ఆ సి ఫారసుకు దాదాపు అరవై ఏళ్లు గడిచినా, ఇప్పటికీ 3 శాతం దాటని కేటాయింపులు కొనసాగుతుండటం దేశ పాలనా వైఫల్యానికి నిదర్శనం. విద్యారంగానికి తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల అనేక మౌలిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు లేకపోవడం, ఉపాధ్యాయుల కొరత, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, డిజిటల్ వసతుల లేమి వంటి సమస్యలు విద్యా నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా తాగునీరు, మరుగుదొడ్లు లేని పాఠశాలలు ఉండటంమనకు సిగ్గు కలిగించే వాస్తవం. ఉన్నత విద్య రంగంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. విశ్వవిద్యాలయాలు నిధుల కొరతతో పరిశోధన కార్యక్రమాలను కుదించుకున్నాయి.
Read Also : POCSO case: బాలికలపై అత్యాచారం.. జ్యోతిషుడికి 200 ఏళ్ల జైలు శిక్ష

అధ్యాపక నియామకాలు నిలిచిపోవడం, ప్రయో గశాలల అభివృద్ధి జరగకపోవడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే స్థితి మన విద్యాసంస్థలకు లేకుండాపోతోంది. ఫలితంగా ప్రతిభావంతులైన యువత చదువు, ఉద్యోగాల కోసం విదేశాల వైపు వెళ్లడం పెరుగుతోంది. ఇది కేవలం వ్యక్తిగత నష్టమే కాదు, దేశ మేధోసంపత్తి కోల్పోయే పరిస్థితి. ప్రభుత్వం తరచూ నూతన విద్యా విధానం – 2020 గురించి గొప్పగా ప్రచారం చేస్తోంది. కానీ విధా నాలు అమలు కావాలంటే మాటలు సరిపోవు, నిధులు కావాలి. బహుభాషా విద్య, ఉ పాధ్యాయుల శిక్షణ, నూతన పాఠ్యాంశాలు, డిజిటల్ బోధన, పరిశోధన ప్రోత్సాహం ఇవన్నీ అమలు చేయాలంటే భారీ పెట్టుబడులు అవసరం. కానీ 2.6 శాతం బడ్జెట్ కేటాయింపుతో ఈ లక్ష్యాలన్నీ సాధిస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది. ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే, విద్యను ఖర్చుగా చూడటం తప్ప పెట్టుబడిగా చూడని దృష్టికోణం ఇప్పటికీ పాలకుల్లో కొనసాగుతోంది. రహదారులు, వంతె నలు, భవనాలు అవసరమే. కానీ వాటిని నిర్మించి నిర్వ హించేది చదువుకున్న, నైపుణ్యం కలిగిన పౌరులే అన్న సత్యాన్ని విస్మరించలేం. విద్యలో పెట్టుబడి పెట్టడమే దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధికి, సామాజిక సమానత్వానికి పునాది. విద్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే సామాజిక అసమానతలు మరింత
పెరుగుతాయి. పేద, వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన విద్య అందని పరిస్థితి కొనసాగితే నిరుద్యోగం, అసంతృప్తి, సామాజిక అశాంతి పెరిగే ప్రమా దం ఉంది. ఇవన్నీ ప్రజాస్వామ్యానికి, దేశ ఐక్యతకు ప్రమా దకర పరిణామాలను తెస్తాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ అభివృద్ధికి విద్య ముఖ్యమైన పునాది. పేదరిక నిర్మూల నకు విద్య ఒక శక్తివంతమైన సాధనం. శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల అభివృద్ధి. సమాన విద్యావకాశాలు అంద రికీ కల్పించడం, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి 6శాతం నిధులు అవసరమని కొఠారి కమిషన్ భావించింది. కమిషన్ సూచిం చిన 6శాతం లక్ష్యం అసాధ్యమైనదికాదు. రాజకీయ సంక ల్పం ఉంటే అది సాధ్యమే. విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చే బడ్జెట్‌నే నిజమైన అభివృద్ధి బడ్జెట్‌గా పరిగణించాలి. లేకపోతే వికసిత భారత్ వంటి నినాదాలు కేవలంప్రచార వాక్యాలుగానే మిగిలిపోతాయి. దేశభవిష్యత్తును అంధకారం లోకి నెట్టకుండా ఉండాలంటే, విద్యారంగానికి జరుగుతున్న ఈ అన్యాయాన్ని వెంటనే సరిచేయాలి. బడ్జెట్ పుస్తకాలలో మాత్రమే కాదు, తరగతి గదుల్లోనూ మార్పుకనిపించాలి.
-తిప్పర్తి శ్రీనివాస్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: