हिन्दी | Epaper

High BP Medicine : హైబీపీ మందుల‌ను వాడుతున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..

Sudha
High BP Medicine : హైబీపీ మందుల‌ను వాడుతున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..

అధిక ర‌క్త‌పోటు ఇప్పుడు స‌ర్వ‌సాధార‌ణంగా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు. చాలా మంది ఇది అతి పెద్ద స‌మ‌స్య కాద‌ని భావిస్తారు కానీ ఇది నిశ్శ‌బ్దంగా అనేక తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. గుండె నుండి మూత్ర‌పిండాల వ‌ర‌కు అనేక ముఖ్య‌మైన అవ‌య‌వాల‌కు తీవ్ర‌మైన న‌ష్టాన్ని క‌లిగిస్తుంది. జీవ‌న శైలిలో మార్పులు, ఆహారపు అల‌వాట్ల‌ల్లో మార్పులు చేసుకోవ‌డం వ‌ల్ల అధిక ర‌క్త‌పోటు (High BP Medicine)స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అయితే అన్నిసార్లు ర‌క్త‌పోటును నియంత్రించ‌క‌పోవ‌చ్చు. క‌నుక వైద్యులు ర‌క్త‌పోటును నియంత్రించ‌డానికి మందుల‌ను సూచిస్తూ ఉంటారు. చాలా మంది ర‌క్త‌పోటు మందుల‌ను వాడుతూ ఉంటారు. అయితే వీటిని తీసుకునే స‌మ‌యంలో చాలా మంది చేసే కొన్ని త‌ప్పుల కార‌ణంగా ఈ మందులు ప్ర‌భావ‌వంత‌మైన ఫ‌లితాల‌ను ఇవ్వ‌వు. ర‌క్త‌పోటు (High BP Medicine)మందులు ప్ర‌భావ‌వంత‌మైన ఫ‌లితాల‌ను ఇవ్వ‌డానికి కొన్ని చిట్కాల‌ను పాటించాల్సి ఉంటుంది. ఈ మందుల‌ను తీసుకునే స‌మ‌యంలో కొన్ని చేయ‌కూడ‌ని ప‌నులు కూడా ఉంటాయి. ర‌క్త‌పోటు మందులు తీసుకునే స‌మ‌యంలో చేయాల్సిన, చేయ‌కూడ‌ని ప‌నుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : http://Pumpkin Seeds: గుమ్మడి గింజలు తింటే సంతాన సమస్యలకు చెక్!

High BP Medicine
High BP Medicine

వైద్యుల సూచ‌న మేర‌కు ..

ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌కు వైద్యులు సూచించిన మోతాదులో మందులు త‌ప్ప‌కుండా వాడాల్సిందే. మందుల విష‌యంలో మోతాదు, స‌మ‌యాన్ని వైద్యుల సూచ‌న మేర‌కు పాటించాల్సిందే. మందుల‌ను త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌ప్ర‌వాహంలో స్థిర‌మైన స్థాయిలు ఎల్ల‌ప్పుడూ నిర్వ‌హించ‌బ‌డ‌తాయి. మందుల‌ను తీసుకుంటూనే ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్ని తీసుకోవాలి. ప్ర‌తిరోజూ వ్యాయామం చేయాలి. శ‌రీర బ‌రువును అదుపులో ఉంచుకోవాలి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. చ‌క్క‌టి జీవ‌న‌శైలిని పాటించ‌డం వ‌ల్ల తీసుకునే మందుల ప్ర‌భావం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే ర‌క్త‌పోటు మందుల‌ను వాడ‌డం వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల‌ను తెలుసుకోవ‌డం కూడా చాలా మంచిది. కొన్నిసార్లు ఈ మందులు కాళ్ల వాపు, పొడి ద‌గ్గు, మైకం వంటి దుష్ప్ర‌భావాల‌ను క‌లిగిస్తాయి. కనుక మందులను వాడే స‌మ‌యంలో అటువంటి ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించాలి.

ఇష్టం వ‌చ్చిన‌ట్టు మందుల‌ను వాడ‌కూడ‌దు

ర‌క్త‌పోటును ప‌ర్య‌వేక్షించ‌డానికి క్ర‌మం త‌ప్ప‌కుండా వైద్యుడితో త‌నిఖీ చేయించుకోవాలి. దీంతో మందుల్లో స‌ర్దుబాట్లు చేసుకునే అవ‌కాశం ఉంది. అలాగే వైద్యుడిని సంప్ర‌దించ‌డానికి ముందు నుండే ఇంట్లో ర‌క్తపోటును ప‌రీక్షించుకోవాలి. రీడింగ్ ల‌ను న‌మోదు చేసి ఉంచుకోవాలి. ర‌క్త‌పోటుకు మందుల‌ను వైద్యుడిని సంప్ర‌దించిన త‌రువాతే వాడాలి. వైద్యుడిని సంప్ర‌దించ‌కుండా ఇష్టం వ‌చ్చిన‌ట్టు మందుల‌ను వాడ‌కూడ‌దు. న‌చ్చిన‌ట్టు మందుల‌ను వాడ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువయ్యే అవ‌కాశం ఉంది. అలాగే మందులు వాడ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది క‌దా అని కొంద‌రు వెంట‌నే మందులు తీసుకోవ‌డం త‌గ్గిస్తారు. ఇలా చేయ‌డం అస్సలు స‌రైన ప‌ద్ద‌తి కాద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల రక్త‌పోటు మ‌రింత ఎక్కువ‌య్యి హైప‌ర్ టెన్ష‌న్ వ‌స్తుంద‌ని వైద్యులు తెలియ‌జేస్తున్నారు.

High BP Medicine
High BP Medicine

ఎల్ల‌ప్పుడూ హైడ్రేటెడ్ గా ..

అలాగే ర‌క్త‌పోటుకు మందులు వాడే వారు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు వాడే మందుల గురించి వైద్యుడికి ముందుగానే చెప్ప‌డం మంచిది. రక్త‌పోటుతో బాధ‌ప‌డే వారు నీటిని ఎక్కువ‌గా తీసుకోవాలి. శ‌రీరం ఎల్ల‌ప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. మ‌ద్యం తాగ‌డం మానేయాలి. మందుల‌ను వాడే విష‌యంలో ఇలా త‌గిన జాగ్ర‌త్తలు తీసుకుంటూనే జీవ‌న‌శైలిలో మార్పులు చేసుకోవాలి. పొటాషియం అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. పండ్లు, కూర‌గాయ‌లు, తృణ‌ధాన్యాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. ఒత్తిడి అదుపులో ఉండేలా ధ్యానం, యోగా వంటివి చేయాలి. ఇలా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ర‌క్త‌పోటు మందుల‌ను వాడ‌డం వ‌ల్ల మందుల ప్ర‌భావం అధికంగా ఉంటుద‌ని వైద్యులు తెలియ‌జేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870