हिन्दी | Epaper

artificial intelligence : ఎఐపై నియంత్రణ లేకపోతే వినాశనమే!

Sudha
artificial intelligence : ఎఐపై నియంత్రణ లేకపోతే వినాశనమే!

ఆ ధునిక సాంకేతిక విప్లవానికి భారత్ వేదిక ఈ నెల 16నుంచి 20 తేదీల వరకు ఢిల్లీలోని భారత్ మండ పంలో కృత్రిమ మేధపై అంతర్జాతీయ స్థాయి ఏఐ ఎక్స్పో2026 ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతుంది. విద్యుత్ ఆవిష్క రణ ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో, 21వ శతాబ్దంలో కృత్రిమ మేధ కూడా అంతే స్థాయిలో మానవ జీవన విధానాలను, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పాలన, వ్యాపారం, ఆర్థిక వ్యవస్థలను, రాజకీయ నిర్మాణాలను ప్రభావితం చేస్తున్నదనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా బలపడుతోంది. ఈ సదస్సులో ప్రపంచ దేశాల ప్రభుత్వా ధినేతలు, పరిశ్రమల అగ్రగాములు, ప్రముఖ టెక్నాలజీ సంస్థల సీఈఓలు, శాస్త్రవేత్తలు, విధాననిర్ణేతలు పాల్గొననున్నారు. అలాగే ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా హాజరవుతారు. సుమారు 700కి పైగా వివిధ అంశాలపై సెషన్లు నిర్వహించనున్న ఈ సమ్మిట్, కేవలం సాంకేతిక ప్రదర్శన వేదికగా కాకుం డా, భవిష్యత్ మానవ సమాజ దిశను నిర్ణయించే విధాన చర్చలకు కేంద్రమవుతోంది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా ఆర్థిక వ్యవస్థ, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థల విస్తరణ, గ్లోబల్ కనెక్టివిటీ వంటి అంశాల నేపథ్యంలో భారత్ ఈ వేదికను వినియోగించుకోవడం ఒక వ్యూహాత్మక అడుగు. ప్రపంచ సాంకేతిక నాయకత్వంలో భారతదేశం కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఈ చర్చలు సాగనున్నాయి. ఇప్పుడు ఏఐ ప్రతిరోజు జీవనంలో అంతర్భాగమై పోయింది. ఆరోగ్య రంగంలో ముందస్తు వ్యాధి నిర్ధారణ, వైద్యచిత్రాల విశ్లేషణ, వ్యవసాయంలో వాతావరణ అంచనాలు, పంటల నిర్వహణ, విద్యారంగంలో వ్యక్తిగతీకరించిన అభ్యాస పద్ధతులు, పరిశ్ర మల్లో ఆటోమేషన్ సరఫరా గొలుసు నిర్వహణ – ఇవన్నీ ఏఐ ఆధారిత మార్పులే. 2023-24 కాలంలో ఏఐపై అనేక భయాలు వ్యక్తమయ్యాయి. ఉద్యోగాలు కోల్పోతాం, మనిషిని భర్తీ చేస్తుంది, నియంత్రణ తప్పుతుంది వంటి చర్చలు జోరుగా సాగాయి.

Read Also: http://CM Revanth at AI Summit: ఏఐ సమ్మిట్‌లో సీఎం రేవంత్


artificial intelligence

artificial intelligence

2025-26 నాటికి ప్రపంచ రాజకీయ చర్చలు అవకాశాల వైపు మళ్లాయి. పెట్టుబడులు పెరిగాయి. దేశాలు ఏఐలో ఆధిపత్యం సాధిం చడానికి పోటీ పడుతున్నాయి. అయితే భయం తగ్గిందని ప్రమాదం కూడా తగ్గిందని భావించడం పొరపాటు. వాస్తవానికి సాంకేతిక సామర్థ్యం పెరిగిన కొద్దీ దాని ప్రభావం మరింత విస్తరిస్తుంది. అణుశక్తి విద్యుత్ ఉ త్పత్తికి ఉపయోగపడినట్టే వినాశనానికి కారణమైందని చరిత్ర చెబు తోంది. అలాగే కృత్రిమ మేధ కూడా ద్విముఖ కత్తి లాంటిది. ఏఐ (artificial intelligence)ద్వారా ఉత్పాదకత పెరిగి ఆర్థిక వృద్ధి వేగవంతమవు తుంది. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, అవినీతి నియంత్ర ణకు సాంకేతిక సహకారం లభిస్తుంది. పేదరిక నిర్మూలన లో డేటా ఆధారిత నిర్ణయాలు సరూకరిస్తాయి. ప్రకృతి విప త్తుల ముందస్తు హెచ్చరికలు, వాతావరణ మార్పుల అంచ నాలు వంటి అంశాల్లో కూడా ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి ఇది ఒక చారిత్రాత్మక అవకాశం. యువ జనాభా, డిజిటల్ మౌలిక సదుపాయాలు, స్టార్టప్ సంస్కృతి – ఇవన్నీ కలిసి ఏఐ (artificial intelligence)విప్లవంలో భారత్నుముందుకు తీసుకెళ్లగలవు. అయితే ఈ అభివృద్ధి సమగ్రతతో కూడి ఉండాలి. నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రయోజనం చేకూ రాలి. ఏఐ శక్తి అపారమైనది. ఒక దేశం లేదా కార్పొరేట్ సంస్థ చేతుల్లో కేంద్రీకృతమైతే అనేక రకాల ముప్పులు తలెత్తవచ్చు. స్వయం నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరిన ఏఐ వ్యవస్థలు రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించవచ్చు. కానీ అదే సమయంలో సైబర్ యుద్ధాలు, స్వయంచాలిత ఆయుధ వ్యవస్థలు వంటి అంశాల్లో నియంత్రణ తప్పితే జాతీయ భద్రతకు ప్రమాదం. దుష్ట శక్తులు, ఉగ్రవాద గుంపులు ఏఐని సైబర్ దాడులు, దుష్ప్రచారం, జీవ ఆయు ధాల రూపకల్పన వంటి కార్యకలాపాలకు వాడితే ప్రపంచ భద్రతకు తీవ్ర సవాలు. ఏఐ ఆధిపత్యం కొద్ది కార్పొరేట్ సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతమైతే ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. డేటా, నీరు, విద్యుత్, నైపుణ్య మానవ వనరులు – ఇవన్నీ కొందరి నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఏఐ ఉత్పాదకతను పెంచినా, అనేక సంప్రదాయ ఉద్యోగాలు నశించే అవకాశం ఉంది. కొత్త నైపుణ్యాల కోసం పెద్ద ఎత్తున శిక్షణ అవసరం. లేకపోతే నిరుద్యోగం, సామా జిక అస్థిరత పెరుగుతాయి. పౌరహక్కులు, గోప్యత, వివక్ష వంటి అంశాలు కీలకం.


artificial intelligence

artificial intelligence

ఏఐమోడళ్లలో పక్షపాత వైఖరులు నిక్షిప్తమైతే సామాజిక అన్యాయం పెరుగుతుంది. ప్రజా స్వామ్య వ్యవస్థలపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఖచ్చితమైన నియంత్రణా చట్టాలు రూపొందించాలి. ఆవిష్కరణలను అడ్డుకోకుండా, ప్రమాదాల ను మాత్రమే కట్టడి చేసే విధానాలు అవసరం. కంపెనీలు స్వచ్చందంగా బాధ్యత వహించాలి. అంతర్జాతీయ స్థాయిలో పర్యవేక్షణ, పారదర్శకత, డేటా రక్షణ ప్రమాణాలు రూపొం దించాలి. భారత్లో జరుగుతున్న ఈ సమ్మిట్ ఈ దిశగా మార్గదర్శకంగా నిలవాలి. ప్రపంచ దేశాలు కలిసి ఒక సాధా రణ నైతిక చట్రం రూపొందించగలిగితేనే ఏఐ ప్రయోజనా లు సమానంగా పంచబడతాయి. సాంకేతికత స్వతహాగా తటస్థం. దాని వినియోగమే దాని స్వరూపాన్ని నిర్ణయిస్తుం ది. కృత్రిమ మేధ మానవ వికాసానికి అపార అవకాశాలను అందిస్తోంది. అదే సమయంలో నియంత్రణ లేకపోతే వినా శనానికి దారితీసే శక్తి కూడా ఉంది. అందువల్ల ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కేవలం పెట్టుబడుల వేదికగా కాకుండా, మానవీయ విలువలకు కట్టుబడి ఉండే గ్లోబల్ ఒప్పందానికి దారితీయాలి. సామ్రాజ్యవాద స్వార్థాలు, కార్పొరేట్ ఆధి పత్యం, డేటా, దోపిడీ వంటి అంశాలను నియంత్రించేందుకు అంతర్జాతీయ సహకారం అవసరం. పారదర్శకత, బాధ్యత, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ నాలుగు స్తంభాలపై ఏఐ భవిష్యత్తు నిర్మితమవ్వాలి. అభివృద్ధి, ప్రగతి, శాంతిఇవే సాంకేతిక ప్రయాణానికి పరమావధిగా నిలవాలి. ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమైన చర్చలు ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలి. కృత్రిమ మేధ మనిషిని భర్తీ చేయడానికి కాదు, మానవ వికాసాన్ని వేగవంతం చేయడానికి. ఈ అగ్ని పరీక్షలో మానవీయ విలువలు గెల వాలి. ప్రపంచ శాంతి, సమగ్ర అభివృద్ధి, బాధ్యతాయుత సాంకేతిక యుగానికి భారత్ మార్గదర్శకంగా నిలవాలి. ఆధునిక సాంకేతికత సమాజ ప్రగతికి, వికాసానికి, విశ్వ శాంతికి తోడ్పడాలని విశ్వమానవాళి ఆకాంక్షిస్తోంది.
-మేకిరి దామోదర్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870