Telangana Agriculture News : రైతులపై ఫర్టిలైజర్ కంపెనీలు కుట్రలకు తెరలేపాయి. పశువులు, కోళ్ల ఎరువులు వినియోగిస్తే పంట దిగుబడి తక్కువ వస్తుందని, తాము తయారు చేసిన బయోచార్, ఆర్గానిక్ మ్యాటర్, జింక్, ఫెర్రస్ లాంటి ఫర్టిలైజర్లు వాడితే రెండింతలు కాపు వస్తుందని రైతులను మభ్యపెడుతూ అవసరం లేని రసాయన ఎరువులు, పురుగుమందులను అంటకడుతూ అందినకాడికి దోచుకుంటున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి వసతులు పెరగడంతోపాటు గడిచిన దాదాపు వదేళ్లుగా వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండడంతో వరి, పత్తితోపాటు ఇతర వంటల సాగు గణనీయంగా పెరిగింది.
Read Also: Municipal Polling Counting : మొదలైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. !!

రానురాను గిట్టుబాటు కాని వరిసాగు
ఏటికేడు రాష్ట్రంలో సాగుభూమి విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం దాదాపు కోటి 30 లక్షల ఎకరాలకు సాగు విస్తరించినట్టు వ్యవసాయశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా వరి సాగు గడిచిన పదేళ్లుగా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఖరీఫ్, రబీ ఇలా ప్రతీ సీజన్లో రాష్ట్రంలో దాదాపు 50లక్షల నుండి 60లక్షల ఎకరాల మధ్య వరి సాగువుతోంది..
అయితే రైతులు మేలైన వరి విత్తనాల కోసం ప్రయివేటు ఫర్టిలైజర్ షాపులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా తమకు ఎక్కువ కమిషన్ ముట్టజెప్పే కంపెనీల వరి విత్తనాలను రైతులకు విక్రయించడంతోపాటు పనిలోపనిగా దిగుబడి ఎక్కువగా వస్తుందని ఆశచూపి అవసరం లేని రసాయన పురుగు, అడుగు మందులను రైతులకు అంటగడుతున్నారని ఫర్టిలైజర్ షాపుల యాజమాన్యాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో వరి సాగు చేసే రైతులు.. పశువుల పేడతోపాటు యూరియా, డీఏపీతోపాటు గుళికలు చల్లే వారు. ఇటీవలి కాలంలో కోడిపెంట వినియోగం కూడా వరిసాగులో పెరుగుతోంది. అయితే ఇటీవలి కాలంలో ఫర్టిలైజర్ల కంపెనీలు ఎరువుల దుకాణాల యాజమాన్యాలతో కుమ్మక్కై పాత పద్ధతికి స్వస్తి పలికి, తాము సూచించిన ఎరువులు వాడితే గతంలోకన్నా ఎకరాకు పది క్వింటాళ్లు అధికంగా పండుతాయని ప్రచారం మొదలు పెట్టాయి. ఒక పక్కన వ్యవసాయశాఖ, రాష్ట్ర ప్రభుత్వం అధిక ఎరువుల వినియోగంతో భూమి సారం కోల్పోయి విషతుల్యం అవుతుందని హెచ్చరిస్తుంటే ఆయా కంపెనీలు మాత్రం మధ్య దళారులను నియమించుకుని తక్కువ ధరలకే ఫర్టిలైజర్లు అంటూ భూమిని విషతుల్యం చేసే హానికర ఎరువులు, పురుగు మందులను రైతులకు అంటగడుతున్నాయి.
మొత్తంగా నకిలీ విత్తనాలతో ఇప్పటికే నిండా మునుగుతున్న రైతులకు నాణ్యత లేని, అవసరం లేని ఫర్టిలైజర్లు సమస్యగా మారుతున్నాయి. ప్రస్తుతం వరిలో తాము సూచించిన రసాయన ఎరువులు, మందులు వాడితే అధికంగా పిలకలు వస్తాయని నాలుగైదు రకాల రసాయన మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో యూరియా, డీఏపీతోపాటు 20:20 అని, పోటాష్ వేస్తే గింజ తాలు పోదని ఇలా సలురకాలుగా మభ్యపెడుతూ రైతులకు ఫర్టిలైజర్ షాపులు ఎరువులు, పురుగుమందులను అంటగడుతుండడంతో ఎకరా వరిసాగు అనేది రైతులకు తలకుమించిన ఆర్థికభారంగా మారింది.

వాటికే ఎకరాకు రూ.20వేలకు పైగా పెట్టుబడి
ఎకరా వరి సాగుకు దున్నకం, కలుపు, నాటు ఖర్చులు కాకుండా ఎరువులు, పురుగుమందులకే రూ.20వేలదాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొనడంతో అన్నదాతలు అప్పులు తెచ్చి వరి సాగు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వరిలో ఏ సమయంలో ఏయే ఎరువులు వాడాలో, ఏ మోతాదులో చల్లాలో/పిచికారి చేయాలో అవగాహన కల్పించాల్సిన వ్యవసాయశాఖ అధికారులు. విస్తరణాధికారులు రైతులకు అందుబాటులో లేకపోవడంతో ఫర్టిలైజర్ షాపులు, ఎరువుల, పురుగు మందుల కంపెనీల వ్యాపారాలు అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వరిసాగు గిట్టుబాటుకాని పరిస్థితులు నెలకొన్నాయి.
అదేవిధంగా వరితోపాటు ఇటీవలి కాలంలో రాష్ట్రంలో విస్తరిస్తున్న ఆయిల్ ఫామ్ సాగులోనూ అవసరంలేని రసాయ ఎరువులు, పురుగు మందుల వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. దేశీయ పామాయిల్ ఉత్పత్తిలో 98 శాతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 73 వేల మంది రైతులు సుమారుగా 2.72 లక్షల ఎకరాల్లో పంటను సాగు చేశారు. ప్రభుత్వం 31 జిల్లాల్లో సాగు విస్తరణ చేపట్టేందుకు 14 కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. మరోవైపు మొక్కలు పెంచడం: కోసం రాష్ట్రవ్యాప్తంగా 44 నర్సరీలు ఏర్పాటు చేశారు.
గతంలో మామిడి లాంటి దీర్ఘకాలిక ఫలసాయం ఇచ్చే పంటకు కక్తార్ లాంటి గ్రోత్ ప్రమోటర్స్ వాడటంతో దాని నియంత్రణ కోసం విపరీతంగా పురుగు, తెగుళ్ల మందులు వాడి చివరికి పంటను తగ్గించే పరిస్థితి వచ్చింది. ఆయిల్ పాము పశువుల, కోళ్ల ఎరువులతోపాటు వాటి మట్టలు ఎప్పటికప్పడు తొలగిస్తే ప్రతి ఎకరంలో ప్రతి సంవత్సరం కనీసం 5 టన్నుల ఆర్గానిక్ మ్యాటర్ భూమిలో కలుస్తుంది. వీటితోపాటు శాస్త్రవేత్తలు నూచించిన ఫర్టిలైజర్లు పంటకు సరిపోతాయని, అవి గత 30 ఏళ్లుగా సాగు చేస్తున్న రైతులు తమ అనుభవం ద్వారా కొత్త రైతులకు సూచిస్తున్నారు.
ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో సారవంతమైన భూములు, నీటి వసతి ఉన్నభూములు ఉండటంతో అక్కడ అధికంగా ఫర్టిలైజర్ వాడవద్దని కోరుతున్నారు. కంపెనీలు వాళ్ల లాభాల కోసం తప్ప రైతుల మేలు కోసం ఏనాడూ. పనిచేయవని చెబుతున్నారు. మొక్కలకు తెగులు వస్తే స్థానిక ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించి వారి సలహాలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: