తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సందడి పతాక స్థాయికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం అట్టహాసంగా ముగిసింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో విజయకేతనం ఎగురవేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తించారు. మంత్రులకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కరీంనగర్, నిజామాబాద్ వంటి కీలక కార్పొరేషన్లలో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
Ponnam Prabhakar: పట్టణం చుట్టూ రింగు రోడ్డుతో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని చాటుకునేందుకు ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావిస్తోంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ముమ్మరంగా పర్యటిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పదేళ్ల అభివృద్ధిని చూసి ఓటు వేయాలని వారు ప్రజలను అభ్యర్థించారు. అటు బీజేపీ సైతం తగ్గేదేలే అన్నట్లుగా ప్రచారం సాగించింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు పార్టీ ఎంపీలు రంగంలోకి దిగి, డబుల్ ఇంజన్ సర్కార్ అవశ్యకతను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎంఐఎం కూడా తన ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఒంటరిగానే పోటీ చేస్తూ గట్టి పోటీనిస్తోంది.

ఎల్లుండి (ఫిబ్రవరి 11) జరగనున్న ఈ పోలింగ్‌లో సుమారు 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 2,996 వార్డులకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో గెలుపోటములపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 13న వెలువడనున్న ఫలితాలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా మారనున్నాయి. ఈ ఎన్నికల ద్వారా పట్టణ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.