పార్వతీపురం(Parvathipuram) మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో హృదయవిదారక సంఘటన జరిగింది. ఇంట్లో చలి నివారణ కోసం వెలిగించిన నిప్పుల కుంపటి కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతోంది.
Read Also: UP: తన కాలును తానే నరుక్కున్న యువకుడు.. ఎందుకో తెలుసా?

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తొలుత, కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు భావించారు. అయితే పోలీసులు జరిపిన విచారణలో ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా తేలింది. డీఎస్పీ రాంబాబు, సీఐ తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. వనజ గ్రామానికి చెందిన మీనక మధు (35), సత్యవతి (30) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె మాధురి చినమేరంగి కేజీబీవీలో చదువుకుంటుండగా, రెండో కుమార్తె మోక్ష తాతగారి ఊరు బొమ్మికలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తోంది. చిన్నారులు అయేషా (6), మోస్య (4) తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు.
ఉదయం తలుపులు తెరిచి చూడగా బయటపడ్డ నిజం
గురువారం రాత్రి మధు, సత్యవతి, అయేషా, మోస్య ఇంట్లోనే నిద్రించారు. శుక్రవారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తెరుచుకోకపోవడంతో చుట్టుపక్కల వారు అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా నలుగురు కదలికలేని స్థితిలో కనిపించారు. వెంటనే వారిని చినమేరంగి సామాజిక ఆసుపత్రికి తరలించారు.
ముగ్గురు మృతి, ఒకరికి చికిత్స
ఆసుపత్రిలో మధు, సత్యవతి, మోస్య అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయేషా పరిస్థితి విషమంగా ఉండటంతో పార్వతీపురం(Parvathipuram) జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నానికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఇంట్లో తలుపులు మూసి నిప్పుల కుంపటి వెలిగించడంతో కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలై ఊపిరాడక ఈ దుర్ఘటన జరిగిందని తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: