‘ఉలగం ఉన్ కైగలిల్’ పథకం
విద్యార్థులను సాంకేతికంగా మరింత శక్తివంతులను చేసే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీ పథకం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ‘ఉలగం ఉన్ కైగలిల్’ (ప్రపంచం మీ చేతుల్లో) అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమం తొలి దశను ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్(MK Stalin) ప్రారంభించనున్నారు. చెన్నై ట్రేడ్ సెంటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొననున్నారు.
Read also: Central Govt: ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ బిల్లులకు బ్రేక్

డిజిటల్ యుగంలో విద్యార్థులు వెనుకబడకుండా ఉండేలా చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. మొత్తం రెండు దశల్లో 20 లక్షల ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయాలని నిర్ణయించగా, మొదటి దశలోనే 10 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేయనున్నారు. ఈ పథకానికి ప్రభుత్వ ఇంజనీరింగ్, మెడికల్, న్యాయ, వ్యవసాయ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్, ఐటీఐ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు అర్హులుగా నిర్ణయించారు. ఉన్నత విద్యలో కొనసాగుతున్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వం అందజేస్తున్న ల్యాప్‌టాప్‌లు డెల్, ఏసర్, హెచ్‌పీ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందినవిగా ఉండనున్నాయి. వీటిలో ఇంటెల్ i3 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఎస్ ఆఫీస్ 365 వంటి ఆధునిక సాంకేతిక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్‌లు విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, వెబ్ డిజైనింగ్, డిజిటల్ స్కిల్స్ వంటి రంగాల్లో నైపుణ్యం సాధించేందుకు తోడ్పడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ తమిళ పుదల్వన్, ఇన్నోవేటివ్ ఉమెన్, ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్(First generation graduate) వంటి పథకాలను ఇప్పటికే అమలు చేస్తోంది. తాజా ల్యాప్‌టాప్ పంపిణీ పథకం ద్వారా గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించి, సమగ్ర అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: