వెనెజువెలా(Venezuela) అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ప్రస్తుతం అమెరికా కస్టడీలో ఉన్నారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో అమెరికా బలగాలు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించాయి. ఈ ఘటన వెనెజువెలా రాజకీయాల్లోనే కాకుండా అంతర్జాతీయ వేదికపై కూడా తీవ్ర దుమారం రేపుతోంది.
Read also: Venezuela Crisis: అమెరికా దాడులతో వెనెజువెలా అంధకారంలోకి

ఈ నేపథ్యంలో, వెనెజువెలాలో అత్యంత ప్రభావవంతమైన మహిళగా గుర్తింపు పొందిన సిలియా ఫ్లోరెస్‌పై అమెరికా ప్రాసిక్యూటర్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అనుకూలంగా వ్యవస్థను మలిచేందుకు ఆమె భారీగా లంచాలు స్వీకరించారని, దేశంలోని యాంటీ-డ్రగ్ సంస్థలను తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని అభియోగాలు మోపారు.
ఇండిక్ట్‌మెంట్‌లో వెల్లడైన ఆరోపణలు
అమెరికా దాఖలు చేసిన ఇండిక్ట్‌మెంట్ ప్రకారం, డ్రగ్స్ రవాణాకు మార్గం సుగమం చేసేందుకు సిలియా ఫ్లోరెస్ లక్షలాది డాలర్ల లంచాలు తీసుకున్నట్లు పేర్కొంది. 2007లో ఒక ప్రముఖ డ్రగ్ ట్రాఫికర్‌ను అప్పటి వెనెజువెలా జాతీయ యాంటీ-డ్రగ్ కార్యాలయ డైరెక్టర్ నెస్టర్ రెవెరోల్ టోరెస్కు పరిచయం చేయడానికి ఆమె ఈ లావాదేవీలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
దీని అనంతరం, ఆ డ్రగ్ స్మగ్లర్ ప్రతి నెలా లంచాలు చెల్లించడంతో పాటు, కొకైన్ తరలించే ప్రతి విమానానికి సుమారు లక్ష డాలర్లు ఇవ్వడానికి ఒప్పందం కుదిరినట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. ఈ మొత్తంలో కొంత భాగం సిలియా ఫ్లోరెస్‌కు చేరినట్లు అమెరికా వాదిస్తోంది. నెస్టర్ రెవెరోల్‌పై ఇప్పటికే 2015లో న్యూయార్క్‌లో నార్కోటిక్స్ కేసు నమోదై ఉండగా, ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు.
కుటుంబ సభ్యులపై కూడా డ్రగ్స్ కేసులు
సిలియా ఫ్లోరెస్ కుటుంబ సభ్యులు కూడా మాదకద్రవ్యాల కేసుల్లో చిక్కుకున్న నేపథ్యం ఉంది. ఆమె సోదరి కుమారులకు 2017లో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో అమెరికాలో 18 ఏళ్ల జైలు శిక్ష పడింది. అధ్యక్షుడి విమానాలు నిలిపే హ్యాంగర్ నుంచే కొకైన్ స్మగ్లింగ్ చేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే, 2022లో ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా వీరికి విడుదల లభించింది.
సాధారణ న్యాయవాదినుంచి శక్తివంతమైన నేతగా
ఒకప్పుడు సాధారణ న్యాయవాదిగా పనిచేసిన సిలియా ఫ్లోరెస్, 1990లలో హ్యూగో చావెజ్ నేతృత్వంలోని సోషలిస్ట్ ఉద్యమంలో చేరి రాజకీయంగా ఎదిగారు. పార్లమెంటులో కీలక పదవులు నిర్వహించిన ఆమె, 1990ల చివరి నుంచి నికోలస్ మదురోకు అత్యంత సన్నిహితురాలిగా ఉన్నారు. 2013లో ఆయనను వివాహం చేసుకున్నారు. అధికారిక పదవి లేకపోయినా, తెరవెనుక దేశ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా ఆమెను భావిస్తారు. మదురో అధికారాన్ని బలపర్చడంలో ఆమె కీలక పాత్ర పోషించారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మదురో కుటుంబంపై విస్తరిస్తున్న ఆరోపణలు
అమెరికా ఆరోపణలు సిలియా ఫ్లోరెస్‌కే పరిమితం కాలేదు. మదురో, ఆయన భార్య, కుమారుడు కలిసి తమ రాజకీయ అధికారాన్ని డ్రగ్స్ రవాణాకు అనుకూలంగా మార్చుకున్నారని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. మదురోపై ఇప్పటికే నార్కో-టెర్రరిజం, కొకైన్ స్మగ్లింగ్ కుట్ర, ఆయుధాల వినియోగం వంటి పలు తీవ్రమైన అభియోగాలు నమోదై ఉన్నాయి.
ఈ కేసులు వెనెజువెలా(Venezuela) రాజకీయ వ్యవస్థలో మాదకద్రవ్యాల మాఫియా ప్రభావం, అధికార దుర్వినియోగం ఎంత లోతుగా ఉందో చూపిస్తున్నాయని అంతర్జాతీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సిలియా ఫ్లోరెస్ పాత్రపై వివాదాలు మరింత తీవ్రతరం కావడం ఖాయంగా కనిపిస్తోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: