నటుడు శివాజీ మరియు యాంకర్ అనసూయ మధ్య గత కొద్దిరోజులుగా నడుస్తున్న మాటల యుద్ధం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్న తరుణంలో, సీనియర్ నటి రాశి ఈ వివాదంలోకి ప్రవేశించడం ఆసక్తికరంగా మారింది. శివాజీ వాడిన కొన్ని పదాలు సరైనవి కాకపోవచ్చు కానీ, ఆయన ఉద్దేశం తప్పు కాదని రాశి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా శివాజీ ఇప్పటికే తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, అనసూయ పేరును నేరుగా ప్రస్తావించకుండానే ఆమెపై ఘాటైన విమర్శలు గుప్పించారు.
TTD: తిరుమల పవిత్రతపై మచ్చా?.. మద్యం బాటిళ్లతో రచ్చ
రాశి ప్రధానంగా గతంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనసూయ ఒక టీవీ షోలో యాంకర్ గా ఉన్న సమయంలో, తన పేరును కించపరిచేలా ‘రాశి.. ఫలాలు’ అంటూ బాడీ షేమింగ్ తరహాలో డబుల్ మీనింగ్ డైలాగులు పేల్చారని రాశి ఆరోపించారు. ఒక మహిళ అయ్యి ఉండి, మరో నటిని ఉద్దేశించి అంత నీచంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఆ సమయంలో ఆ వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న ఆ షో నిర్వాహకులపై మరియు యాంకర్ పై లీగల్ గా వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నట్లు రాశి వెల్లడించారు.
అయితే, తన తల్లి ఇచ్చిన సలహా వల్ల ఆనాడు తాను వెనక్కి తగ్గానని, గొడవలు ఎందుకని వదిలేశానని రాశి పేర్కొన్నారు. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్న వారు, గతంలో తాము ఇతరుల గురించి ఎంత దారుణంగా మాట్లాడామో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని రాశి చురకలు అంటించారు. శివాజీపై విమర్శలు చేసే ముందు తమ గతాన్ని చూసుకోవాలని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వివాదం కేవలం శివాజీ-అనసూయ మధ్యే కాకుండా, టాలీవుడ్ లోని పాత గొడవలను కూడా తవ్వి తీసేలా మారుతోంది.