ఆంధ్రప్రదేశ్‌లో (AP) స్క్రబ్ టైఫస్ వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH)లో మరో స్క్రబ్ టైఫస్ మరణం నమోదైంది. నన్యా నాయక్ (77) అనే వృద్ధుడు చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు.. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చేరి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. స్క్రబ్ టైఫస్ నిర్ధారణ కాగా.. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం ఆస్పత్రిలో 11 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read also: TG :నేడు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్న పవన్
స్క్రబ్ టైఫస్ ఎలా వస్తుంది.. ఏం చేయాలి..
స్క్రబ్ టైఫస్ వ్యాధి నల్లిని పోలిన చిగ్గర్ మైట్ అనే కీటకం కాటు వలన వ్యాపిస్తుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధి కాదని వైద్యులు చెప్తున్నారు. పొలాలు, తోటలు, నదీ తీరాలు, పశువుల పాకలు, ఎలుకలు, పశువుల శరీరంపై ఈ కీటకాలు ఉంటాయని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొలాలు, తోటల్లో పనిచేసే కూలీలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

గడ్డి, పొదలు వంటి ప్రాంతాలను శుభ్రపరుచుకోవాలని.. ఇంట్లో ఎలుకలు, కీటకాలు లేకుండా చూసుకోవాలంటున్నారు. శరీరం పూర్తిగా కప్పి ఉండేలా దుస్తులు వేసుకోవాలని.. ఆరుబయట నిద్రించడం మానుకోవాలని సూచిస్తున్నారు.ఇంట్లోని పాత మంచాలు, ఫర్నిచర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని.. పరుపులు, దుప్పట్లను శుభ్రపరుచుకోవాలని సూచిస్తున్నారు.
స్క్రబ్ టైఫస్ లక్షణాలు. .
తీవ్ర జ్వరం, నీరసం, తలనొప్పి, వణుకు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కన్పిస్తాయి. అలాగే కీటకం కాటు వేసిన ప్రాంతంలో నల్లని మచ్చ ఏర్పడుతుంది. జీర్ణ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే సకాలంలో చికిత్స తీసుకుంటే కోలుకోవచ్చని చెప్తున్నారు. ప్రాథమిక దశలోనే డాక్టర్లు సూచించిన యాంటీబయాటిక్స్ వాడితే త్వరగా కోలుకోవచ్చని చెప్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: