Corporate companies: కోవిడ్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా పని సంస్కృతిలో చోటుచేసుకున్న అతిపెద్ద మార్పు వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home) విధానమే. అయితే ఇప్పుడు ఆ మోడల్ క్రమంగా తగ్గుముఖం పట్టుతోందని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. 2025 నాటికి రిమోట్ వర్క్‌కు పెద్ద ఎత్తున బ్రేక్ పడే పరిస్థితి నెలకొంటుండగా, అనేక ప్రముఖ సంస్థలు ఉద్యోగులను మళ్లీ పూర్తిస్థాయిలో కార్యాలయాలకు రావాలని ఆదేశిస్తున్నాయి.
Read also: 10 Rupee Note: చిల్లర కష్టాలకు చెక్ పెట్టేలా ఆర్బీఐ ప్లాన్ ఏంటి!
అమెజాన్‌తో మొదలు.. గూగుల్, మెటా వరకు
ఈ ఏడాది ప్రారంభంలోనే అమెజాన్ తన ఉద్యోగులు వారానికి ఐదు రోజులూ ఆఫీస్‌కు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. అదే బాటలో డెల్, ఐబిఎం, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, సేల్స్‌ఫోర్స్, స్నాప్ వంటి టెక్ దిగ్గజాలు కూడా రిటర్న్-టు-ఆఫీస్ పాలసీలను కఠినంగా అమలు చేస్తున్నాయి. ఫైనాన్స్ రంగంలో గోల్డ్‌మన్ సాక్స్, జేపీ మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ ఇప్పటికే కార్యాలయ పనికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. వినోద రంగంలో డిస్నీ, టెలికాం రంగంలో ఏటీ అండ్ టి కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నాయి.

ఇక మెటా గ్రూప్‌కు చెందిన ఇన్స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మోస్సేరీ చేసిన తాజా ప్రకటన ఈ మార్పును మరింత బలపరిచింది. ఫిబ్రవరి 2 నుంచి అమెరికాలోని ఉద్యోగులందరూ పూర్తిస్థాయిలో కార్యాలయాలకు తిరిగి రావాలని కంపెనీ నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఇది రిమోట్ వర్క్‌కు మెటా ఎంత మేర ముగింపు పలుకుతోందో స్పష్టం చేస్తోంది.
ప్రపంచంలోని అతిపెద్ద రిక్రూట్మెంట్ సంస్థల్లో ఒకటైన రాండ్‌స్టాడ్ గ్లోబల్ సీఈఓ సాండర్ వాంట్ నూర్డెండే మాట్లాడుతూ, ‘రిటర్న్-టు-ఆఫీస్’పై సాగిన చర్చలు ఇప్పుడు ముగింపు దశకు వచ్చాయని తెలిపారు. ఇకపై పూర్తిస్థాయి రిమోట్ ఉద్యోగాలు సాధారణ ఉద్యోగులకు కాకుండా, అసాధారణ ప్రతిభ లేదా అరుదైన నైపుణ్యాలు ఉన్నవారికే పరిమితమవుతాయని ఆయన స్పష్టం చేశారు.
2025 జాబ్ మార్కెట్ షాక్
కార్న్ ఫెర్రీ తాజా నివేదిక కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. భవిష్యత్తులో హైబ్రిడ్ విధానం కొనసాగినా, ఫ్లెక్సిబిలిటీ అన్నది ప్రతి ఉద్యోగికి దక్కే హక్కుగా కాకుండా టాప్ టాలెంట్‌కు మాత్రమే ఇచ్చే ప్రత్యేక సౌకర్యంగా మారనుందని అంచనా వేసింది. జూనియర్ స్థాయి లేదా సులభంగా భర్తీ చేయగల ఉద్యోగాల్లో ఉన్నవారు తప్పనిసరిగా కార్యాలయానికి రావాల్సి ఉంటుందని కంపెనీలు స్పష్టంగా చెబుతున్నాయి.
అమెజాన్ క్లౌడ్ విభాగం అధిపతి మాట్ గార్మాన్ అయితే కార్యాలయం నుంచి పని చేయడానికి సిద్ధంగా లేని వారు ఇతర అవకాశాలు చూసుకోవచ్చని కూడా హెచ్చరించినట్లు సమాచారం. మొత్తం మీద ఐదేళ్ల రిమోట్ వర్క్ ప్రయోగం తర్వాత, 2025తో కార్పొరేట్ ప్రపంచం మళ్లీ ఆఫీస్ కేంద్రిత పనితీరుకు మళ్లుతోంది. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు శాశ్వత వీడ్కోలు పలికే దశకు ప్రపంచ ఉద్యోగ విపణి చేరుకుంటోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: