గూడూరు మండలంలోని దామరవంచ గ్రామం(Damaravancha village)లో నూతన పంచాయతి పాలకవర్గ ప్రమాణస్వీకార పర్వం ఉత్కంఠ పరిస్థితుల మధ్య కొనసాగింది. ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల వద్ద గెలుపు ధృవీకరణ పత్రాలు ఉండడంతో గందరగోళ పరిస్థితికి దారితీసింది. తెల్లవారితే ప్రమాణ స్వీకార ప్రక్రియకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఆదివారం రాత్రి సర్పంచ్గా ఓడి పోయినట్లుగా అధికారులు ప్రకటించిన అభ్యర్థి తన వద్ద గెలుపు ధృవీకరణపత్రం ఉందని, తాను కూడా ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని సోషల్మీడియా ద్వారా బహిర్గతం చేయడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా వైరల్గా మారింది.
దీంతో సోమవారం జరగాల్సిన ప్రమాణస్వీకార ఘట్టంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఉత్కంఠ కొనసాగగా అధికారులు పోలీసులు సహకారంతో ప్రమాణ స్వీకార తంతును ఎట్టకేలకు పూర్తి చేయడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు.
Read Also: language: సాంస్కృతిక స్పృహలేని భాషాసేవలేల!
సర్పంచ్ పదవి కోసం కాంగ్రెస్
దామరవంచ గ్రామ సర్పంచ్ పదవి కోసం కాంగ్రెస్ పక్షాన సనప సుజాతసుదర్శన్, బిఆర్ఎస్ (Bharat Rashtra Samithi) పక్షాన నూనావత్ స్వాతిరవినాయక్లు పోటీ పడగా ఈనెల 11న పోలింగ్ తర్వాత నిర్వహించిన కౌంటింగ్ లో తొలుత బిఆర్ఎస్ అభ్యర్థి మూడు ఓట్ల మెజారిటీతో ఉన్నారని, కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థన మేరకు రికౌంటింగ్ నిర్వహించగా కాంగ్రెస్ అభ్యర్థికి ఒక ఓటు మెజారిటీ రావడంతో ఆమె గెలుపొందినట్లు ప్రకటించిన ఎన్నికల అధికారులు గెలుపు ధృవీకరణపత్రం జారీ చేసారు. పంచాయతి పరిధిలోని పది వార్డులకుగాను కాంగ్రెస్, బిఆర్ఎస్లు ఐదు వార్డుల చొప్పున గెలుచుకోగా ఉపసర్పంచ్ ఎన్నిక కూడా ఇచ్చిన గడువులోగా జరగకపోవడంతో నాలుగు రోజుల తర్వాత ప్రత్యేకాధికారి ఉపసర్పంచ్ ఎన్నికను నిర్వహించారు.

ఈలోగా ఈనెల 22న అన్ని పంచాయతీల్లో నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకారం నిర్వహించాలని ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు దామరవంచ గ్రామంలో కూడా ఈ తంతు నిర్వహణకు పాలకవర్గ సభ్యులకు పంచాయతి కార్యదర్శి ఎజెండా జారీ చేసారు. ఒకవైపు ప్రమాణ స్వీకార వేడుకకు ఏర్పాట్లు జరుగుతుండగానే బిఆర్ఎస్ అభ్యర్థి నూనావత్ స్వాతి రవినాయక్ తాను సర్పంచ్గా గెలిచినట్లు ఎన్నికల అధికారులు జారీ చేసిన గెలుపు ధృవీకరణ పత్రాన్ని బహిర్గతం చేసి ఉత్కంఠకు తెరలేపారు. దీంతో ఒకే గ్రామంలో ఇద్దరు అభ్యర్థులకు సర్పంచ్ గెలుపు ధృవపత్రాలు జారీ చేయడమేమిటన్న చర్చ సర్వత్రా కొనసాగింది. ఆ గ్రామంలో కూడా రాజకీయవేడి రగిలించింది. కాగా బిఆర్ఎస్ అభ్యర్థి చూపుతున్న ధృవపత్రం తాము జారీ చేసింది కాదని, నకిలీ ధృవపత్రం సృష్టించారని అదేరాత్రి రిటర్నింగ్ అధికారి గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
ప్రమాణ స్వీకార ఘట్టానికి గ్రామపంచాయతి కార్యాలయం
ఇక సోమవారం పాలకవర్గ ప్రమాణ స్వీకార ఘట్టానికి గ్రామపంచాయతి కార్యాలయం(Gram Panchayat Office) వద్ద ఏర్పాట్లు చేయగా ముందు జాగ్రత్తగా ఎస్ఐ గిరిధర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. ప్రమాణ స్వీకారానికి సర్పంచ్ సనప సుజాతతో పాటు వారి ప్యానల్కు చెందిన ఉపసర్పంచ్, నలుగురు వార్డు సభ్యులు హాజరయ్యారు. మరోవైపు నూనావత్ స్వాతి తన వద్ద ఉన్న గెలుపు ధృవపత్రంతో తన ప్యానల్ వార్డు సభ్యులతో కలిసి తాము కూడా ప్రమాణ స్వీకారం చేస్తామని గ్రామపంచాయతి కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది.
అధికార బలంతో తమకు అన్యాయం చేస్తున్నారని, మూడు ఓట్ల మెజారిటితో గెలిచినా ఆ తర్వాత తమను కౌంటింగ్ వద్దకు అనుమతించకుండా రికౌంటింగ్ పేరుతో కాంగ్రెస్ అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలిచినట్లు ప్రకటించారని స్వాతి ఆరోపించారు. తమకు కూడా గెలుపు ధృవపత్రం జారీ చేసారు కాబట్టి తనతో కూడా ప్రమాణ స్వీకారం చేయించాలని స్వాతి, ఆమె భర్త రవినాయక్, వార్డు సభ్యులు వాదనకు దిగడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఈలోగా అక్కడి పరిస్థితిపై ఉన్నతాధికారులతో మాట్లాడి క్లారిఫై చేసుకున్న ప్రత్యేకాధికారి మంగీలాల్ పంచాయతి కార్యాలయం వద్ద అందుబాటులో ఉన్న వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తుండగానే మిగిలిన వార్డు సభ్యులు కూడా అక్కడికి చేరుకోవడంతో అందరు వార్డు సభ్యులు, ఉపసర్పంచ్ ఉపేందర్, సర్పంచ్ సనప సుజాతతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ప్రమాణస్వీకార ఘట్టం సుఖాంతమైంది. ఇదిలా ఉండగా తమ వద్ద ఉన్న గెలుపు పత్రం ఆధారంగా న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామని, న్యాయం జరిగేవరకు పోరాడుతామని బిఆర్ఎస్ అభ్యర్థి నూనావత్ స్వాతిరవినాయక్ అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
read also: