గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు గణనీయంగా పెరిగాయని కేసీఆర్ గుర్తుచేశారు. ఒకప్పుడు సామాన్య రైతుకు నాలుగెకరాల భూమి ఉన్నా, దాని విలువ కోట్లలో ఉండటంతో వారు ఆర్థికంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో, “శ్రీమంతులుగా” జీవించేవారని ఆయన పేర్కొన్నారు. కేవలం నగరం చుట్టుపక్కలే కాకుండా, మారుమూల గ్రామాల్లో కూడా భూమికి విపరీతమైన డిమాండ్ ఉండేదని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని ఆయన విశ్లేషించారు. అయితే, ప్రభుత్వం మారిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా తలకిందులైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Roshan: క్రికెటర్ కావాలనుకున్న: హీరో రోషన్
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఒకప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడైన భూములను ఇప్పుడు ఎకరం అమ్ముదామన్నా కొనే నాథుడు లేడని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అస్పష్టమైన విధానాలు, హైడ్రా (HYDRAA) వంటి చర్యల వల్ల పెట్టుబడిదారుల్లో భయం నెలకొందని, ఫలితంగా మార్కెట్‌లో లావాదేవీలు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. భూముల ధరలు పడిపోవడం వల్ల కేవలం రియల్టర్లే కాకుండా, తమ అవసరాల కోసం భూమిని అమ్ముకోవాలనుకునే సామాన్య ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ‘సర్వభ్రష్ట ప్రభుత్వం’ అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి మరియు మంత్రులు కేవలం రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు, అక్రమ వసూళ్లు, మరియు కమీషన్ల కోసమే పనిచేస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఒక్క పైసా అభివృద్ధి జరగలేదని, ఉన్న వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. పాలనపై దృష్టి పెట్టకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపులు, వసూళ్లకే ప్రాధాన్యత ఇస్తుండటం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఆయన విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com