వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులపై బహిరంగంగానే తీవ్ర స్థాయి హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇరిగేషన్ విభాగంలోని ఇన్‌చార్జి ఎస్ఈ దేశీనాయక్, మేనేజర్ గంగాధర్ రెడ్డిలు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. “పదవీ విరమణ చేసినా వదిలిపెట్టను, లెక్కలన్నీ సరి చేయిస్తాను.. మీ ఆస్తులు అమ్మించి మరీ కక్కిస్తాను” అంటూ ఆయన అధికారులను బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం ఒక పార్టీకి కొమ్ముకాస్తోందనేది కాకాణి ప్రధాన ఆరోపణ.
YSRCP: జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సోదరి షర్మిల
అయితే, ఈ గొడవకు ప్రధాన కారణం సర్వేపల్లి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న భారీ అవినీతి. ఇటీవల ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాను వెంటబెట్టుకుని క్షేత్రస్థాయిలో పర్యటించి, పనులు పూర్తి కాకుండానే కోట్లాది రూపాయల బిల్లులు ఎలా డ్రా చేశారో ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో సుమారు రూ.150 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని సోమిరెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపై విజిలెన్స్ విచారణ కూడా జరగడం, ప్రాథమికంగా కొన్ని అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడం కాకాణిని ఆత్మరక్షణలో పడేశాయి.

సోమిరెడ్డి చేస్తున్న నిర్దిష్టమైన అవినీతి ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా, కాకాణి గోవర్ధన్ రెడ్డి నేరుగా అధికారులపై ఎదురుదాడికి దిగడం గమనార్హం. ఇది అధికారుల నైతిక ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నమని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన పనుల బిల్లులు, నాణ్యతపై ప్రభుత్వం విచారణను వేగవంతం చేయడంతోనే మాజీ మంత్రి ఇలా అసహనానికి గురవుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి సర్వేపల్లిలో ఇరిగేషన్ నిధుల వ్యవహారం ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com